ఎగ్జిట్ పోల్స్ పై చంద్రబాబు అప్పుడలా..!

Mon May 20 2019 20:00:01 GMT+0530 (IST)

Chandrababu Naidu Changes Opinion on About Exit Poll Surveys

లోక్ సభ - ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నా తరుణంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమన్నాడో అందరికీ తెలిసిన సంగతే. ఎగ్జిట్ పోల్స్ కు ముందు పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. 'ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే వస్తాయి. వాటిని  చూసి భయాందోళన చెందకండి.. అవేవీ నిజం కావు..' అంటూ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత మీడియా ముందు కూడా చంద్రబాబు నాయుడు అదే మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా కూడా ఎగ్జిట్ పోల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు అదే  రీతిన మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఎన్నికలకు సంబంధించి మళ్లీ ఎన్డీయే హవా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఏపీ ఎన్నికల విషయంలో కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్సీపీ హవా ఉంటుందని తెలుగుదేశం చిత్తు అవుతుందని పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్ అబద్ధమని అంటున్నారు. అవి ప్రజలనాడిని పట్టుకోలేవని వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.

ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ గత సార్వత్రిక ఎన్నికలు  అయ్యాకా చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ పోల్స్ విషయంలో వేరే తరహా కామెంట్ చేశారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఆ మేరకు ట్వీట్ కూడా పెట్టారట.

అప్పుడు లోక్ సభ - ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎక్స్ పెక్ట్ చేశాయి. కేంద్రంలో ఎన్డీయే వస్తుందని - ఏపీలో తెలుగుదేశం పార్టీ వస్తుందని గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వివిధ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వాటిని స్వాగతించారు. 'కాంగ్రెస్ కు ఇండియా ఇచ్చిన మెసేజ్.. క్విట్ ఇండియా…' అంటూ ట్వీట్ కూడా వేశారట చంద్రబాబు నాయుడు.

ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు అలా స్పందించి ఇప్పుడు వ్యతిరేకంగా వచ్చిన తరుణంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ను నమ్మడానికి లేదని అవి ప్రజల నాడిని పట్టలేదని వ్యాఖ్యానిస్తూ ఉండటం గమనార్హమని విశ్లేషకులు అంటున్నారు.