బాబు నిజంగా మారారండోయ్... ?

Sat Jan 15 2022 07:00:01 GMT+0530 (IST)

Chandrababu Naidu Changed His Politics

అవుని కొన్ని చూస్తే నమ్మేయాల్సిందే. కాదూ కూడదు అంటే కళ్ళెదుట కనిపిస్తున్నవి భ్రమలు కాదని ఒకసారి తనను తానే గిల్లుకుని చెక్ చేసుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు విషయం కూడా అలాంటిదే అంటున్నారుట అంతా. ఎందుకంటే చంద్రబాబు తాను మారానూ అని ఎపుడూ చెబుతారు. అలా చెప్పేటపుడు ఆయన గద్దె మీద ఉండరు. మాజీగా అవుతారు. అలాంటి టైమ్ లోనే ఆయన తాను మారాను ఇకపైనా ఏ తప్పులూ జరగవు. అందరికీ న్యాయం చేస్తాను అని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తారు.అయితే బాబు ఇలా ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ కి మాత్రం నమ్మకం బాగా తక్కువే అని చెబుతారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఆ పార్టీలో సీనియర్లే సైడ్ కి వెళ్లి రుసరుసలాడుతారు. ఇక పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు కూడా బాబు మీద చేసే పర్మనెంట్ ఆరోపణ కూడా ఇదే.

కానీ కాలం ఎపుడూ ఒకలా ఉండదు కదా. అది మనుషులను మార్చేస్తుంది. అలా బాబుని కూడా బాగా మార్చేసింది. అందుకే ఇపుడు ఎన్నడూ చూడని దృశ్యాలు టీడీపీ తమ్ముళ్లు చూస్తున్నారు. దానికి కళ్ళెదుట ఉదాహరణ మాచర్లలో చంద్రయ్య దారుణ హత్య. ఆ హత్యని పార్టీ అధినేతగా చంద్రబాబు ఖండించారు. అంతే కాదు వైసీపీ నేతలకు ఒక రేంజిలో వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఏపీ మీ అడ్డా కాదు హత్యలు చేసుకుంటూ పోవడానికి అని ఆయన వైసీపీ సర్కార్ మీద  మండిపడ్డారు. అలా క్యాడర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చారు. సాధారణంగా చంద్రబాబు అంతటితో ఆగుతారు. కానీ మాచర్ల ఘటన తరువాత ఆయన నేరుగా వెళ్ళి చంద్రయ్య  కుటుంబాన్ని పరామర్శించారు. అంతేనా పార్టీ తరఫున పాతిక లక్షల పరిహారాన్ని ఇచ్చి కార్యకర్తలకు  ఒక తండ్రిగా తాను ఉన్నానని నిరూపించుకున్నారు.

ఇక చంద్రయ్య శవాన్ని కూడా బాబు భుజం కాసి మోశారు. ఈ ఘటన మొత్తం టీడీపీ క్యాడర్ చూస్తూ ఉండిపోయింది. బాబు ఇలా చేయడంతో ఎవరూ నోట మాటరాని పరిస్థితులో ఉన్నారట. అవును చంద్రబాబు నిజంగా పార్టీకి జీవగర్ర లాంటి నేత పోతే ఆయన పాడె మోసి తానున్నాను అని నిరూపించుకున్నారు. డెబ్బై రెండేళ్ల వయసులో బాబు ఇలా చేయడం అంటే అది ఆయన క్యాడర్ కి ఇచ్చిన ధైర్యంగానే అంతా చూస్తున్నారు.

గతంలో కూడా బాబు విపక్షంలో ఉన్నారు. అపుడు ఆయన ఇలాంటివేవీ చేయలేదు. ఎంతసేపూ సభలూ సమావేశాలతోనే బిజీగా ఉండేవారు. ఎపుడూ నేతలనే పలకరించేవారు. కానీ ఈసారి మాత్రం బాబులో కంప్లీట్ చేంజి కనిపిస్తోంది. ఆయన నాయకులను పక్కన పెట్టేశారు. కార్యకర్తలకే  పెద్ద పీట వేస్తున్నారు. వారికి ఏమైనా కష్టం వస్తే తానే ముందుండి ఆదుకుంటున్నారు.

బాబులో ఇది గొప్ప మార్పు అని సీనియర్ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. టీడీపీకి దేశంలో ఏ పార్టీకీ లేని క్యాడర్ ఉంది. వారు ప్రాణమిచ్చేవారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పసుపు పార్టీ కోసం పనిచేసేవారు. అలాంటి  క్యాడర్ ని నమ్ముకుంటేనే అధికారంలోకి వస్తామని బాబు బాగా గ్రహించారనే అంటున్నారు. అందుకే ఆయన ఒక్కసారి పది మెట్లు దిగి మరీ క్యాడర్ ని భుజానికెత్తుకుంటున్నారు. అవును బాబు మారారు. నిజంగా మారిపోయారు. ఇదే తీరున ఆయన ముందుకు సాగితే క్యాడర్ కి న్యాయం జరుగుతుంది. రేపటి ఎన్నికల్లో టీడీపీ విజయానికి అది పూల బాటలే వేస్తుంది అని చెప్పాల్సిందే.