Begin typing your search above and press return to search.

వాళ్ల దెబ్బకు సమీక్షలను ఆపేసిన చంద్రబాబు నాయుడు!

By:  Tupaki Desk   |   15 May 2019 2:30 PM GMT
వాళ్ల దెబ్బకు సమీక్షలను ఆపేసిన చంద్రబాబు నాయుడు!
X
పోలింగ్ పూర్తి అయిపోయిన నేపథ్యంలో కూడా ఖాళీగా ఉండకుండా.. సమీక్షలు అంటూ హడావుడి చేస్తూ వచ్చారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో సమీక్షలు ఎందుకు అనే ధర్మ సందేహాన్ని తెలుగుదేశం పార్టీ వారే కొందరు వ్యక్తీకరించారట. అయితే చంద్రబాబు నాయుడు వారి మాటలను పట్టించుకోకుండా తన మటుకు తను సమీక్షలు అంటూ హడావుడి చేస్తూ వచ్చారు.

మొత్తం నూటా డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకూ ఒకే సారి సమీక్ష అని ఒక రోజున చంద్రబాబు నాయుడు అందరినీ పిలిపించుకుని మాట్లాడారు. అయితే అంతటితో కూడా బాబు సమీక్షలు అయిపోలేదు. మళ్లీ ఒక్కో లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని వారందరితోనూ ఒక రోజు సమీక్ష అంటూ మళ్లీ హడావుడి మొదలుపెట్టారు. అలా కొన్ని సీట్ల సమీక్షను అయినా పూర్తి చేశారో లేదో.. ఇప్పుడు చంద్రబాబు నాయుడి తదుపరి సమీక్షలు రద్దు అయిపోయినట్టే అని వార్తలు వస్తున్నాయి.

కొన్ని లోక్ సభ సీట్ల పరిధిలోనే సమీక్షను పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు… మిగతా సీట్ల విషయంలో మాత్రం సమీక్షలను నిర్వహించడం లేదట. కౌంటింగ్ కు పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడంలో భాగంగా బాబు తదుపరి సమీక్షలను రద్దు చేసినట్టుగా ప్రకటించారట.

అయితే సమీక్షలు రద్దు కావడానికి అసలు రీజన్ వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలకు పార్టీ నేతలు పలువురు మొహం చాటేశారు. చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి తలెత్తింది. ఎలాగూ తెలుగుదేశం పార్టీ ఓడితుందనే లెక్కతో నేతలు చంద్రబాబును పట్టించుకోవడం మానేశారని, వారి చూపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి పరిణామాల నేఫథ్యంలో.. చంద్రబాబు నాయుడు సమీక్షలు అంటూ హడావుడి చేశారు. దీంతో అసలు కథ బయట పడింది. కొందరు చంద్రబాబు నాయుడి సమీక్షలను అస్సలు పట్టించుకోవడం లేదనే వార్తలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

దీంతో ఫలితాలకు ముందే కొందరు తెలుగుదేశానికి దూరం అయినట్టే అనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితి మరింత తీవ్రం కాకూడదంటే సమీక్షలను ఆపేయడమే మేలని చంద్రబాబు నాయుడు మిగిలిన నియోజకవర్గాల సమీక్షలను రద్దు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి!