Begin typing your search above and press return to search.

బాబు... ఓ జాతీయ ఊసరవెల్లి

By:  Tupaki Desk   |   15 Nov 2018 3:30 PM GMT
బాబు... ఓ జాతీయ ఊసరవెల్లి
X
నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - దేశ రాజకీయాలలో అందరి కంటే తానే సీనియర్‌ అని చెప్పుకునే నాయకుడు. ఇవన్నీ చంద్రబాబు ఉనికిని తెలిపే ఆభరణాలు. ఇక ఆయన ప్రతిష్టకు మచ్చ తెచ్చే అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడం. తన అధికారం కోసం తోడబుట్టిన వారను - బావమరదులను - నమ్ముకున్న వారందరిని నట్టేట ముంచుతారనే అపప్రద ఉంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద గుదిబండలా మారింది.

ఆంధ్రప్రదేశ్‌ కు అన్యాయం చేసిందంటూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్దాయిలో కూటమి కట్టాలని అనుకుంటున్న చంద్రబాబు నాయుడుకు ఆయన గత చరిత్రే అడ్డంకిగా మారుతోందంటున్నారు. గత నెల రోజులుగా నారా చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని బద్ద శత్రువులైన కాంగ్రెస్‌ తో సహా ప్రాంతీయ పార్టీ నాయకులను - జాతీయ స్దాయి నాయకులను కలుస్తున్నారు. అందరికీ బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలంటూ పిలుపునిస్తున్నారు. దేశంలో ఓ సీనియర్ నాయకుడిగా తాను ముందుకు రాకపోతే దేశ ప్రజలు ఇబ్బందులలో పడతారంటూ ప్రసంగిస్తున్నారు. ఈ హడావుడి వెనుక మర్మాన్ని జాతీయ స్దాయి నాయకులు కనిపెట్టలేరని - చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారు.

తానొకటి తలిస్తే ఇతర పార్టీ నాయకులు వేరొకటి తల‌చినట్లు గా పరిస్దితి ఉందంటున్నారు విశ్లేష‌కులు. బీజేపీని గద్దె దించడం కోసం అందరినీ కలిపేందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు వెంపర్లాడుతున్నారో ఇతర పార్టీ నాయకులకు తెలియంది కాదంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీతో కలసిన చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం తన స్వప్రయోజనం కోసమే తప్ప దేశం కోసం కాదని అంటున్నారు. ఇంతకు ముందు వామపక్ష పార్టీలతో జత కట్టిన బాబు యూ టర్న్ తీసుకుని బీజేపీతో కలిసారని చెబుతున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో దేశంలో ఏ నాయకుడు తీసుకోనన్ని యూటర్న్‌ లు ఉన్నాయని మొన్న విజ‌య‌సాయిరెడ్డి కూడా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చేత బోకేలు తీసుకుని - శాలువాలు కప్పించుకున్న నాయకులందరికి బాబు నైజం పూర్తిగా తెలుసంటున్నారు. తాను ఇబ్బందులలో పడ్డారు కాబట్టే బీజేపీని ఓడించాలంటూ పిలుపును ఇస్తున్నారని - లేకపోతే చంద్రబాబు ఇతర పార్టీల స్నేహాన్ని కోరే అవకాశం ఉండదని చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి కట్టినా - వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వస్తే తిరిగి మళ్లీ యూ టర్న్ తీసుకుని కమలనాథుల వైపు పరుగులు తీస్తారని ఇతర పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట‌. ఇందుకే చంద్రబాబు ప్రయత్నాలకు పెద్దగా స్పందన రావటం లేదని అంటున్నారు. ఆరు నెలల క్రితం కూడా చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు అంతగ ఫలించక పోవడానికి ఇతర పార్టీ నాయకుల నుంచి వచ్చే అనుమానాలే కారణమని అంటున్నారు.