Begin typing your search above and press return to search.

దేవినేని ఇంటికి బాబు.. వైసీపీపై ఘాటు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   31 July 2021 5:30 PM GMT
దేవినేని ఇంటికి బాబు.. వైసీపీపై ఘాటు వ్యాఖ్య‌లు
X
టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఆయ‌న కుటుంబ సభ్యులను క‌లిసి ఓదార్చారు. కృష్ణా జిల్లా కొండ‌ప‌ల్లి అట‌వీ ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఉమా అక్క‌డ‌కు వెళ్లి నిర‌స‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ-టీడీపీ వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. ఉద్రిక్త‌ల‌ను రెచ్చ‌గొట్టే విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని దేవినేనితో స‌హా 18 మందిపై కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మండ్రి జైలులో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు నాయుడు దేవినేని ఇంటికి వెళ్లి కుటుంబ స‌భ్యుల‌కు భ‌రోసా ఇచ్చారు. భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని అన్నారు. అక్ర‌మ మైనింగ్ ను బ‌య‌ట‌పెట్టినందుకే దేవినేని ఉమాను అరెస్టు చేశార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

2024లో తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం వైసీపీ నాయ‌కుల‌కు లేద‌న్నారు. అందుకే.. ఈ ట‌ర్మ్ లోనే సాధ్యమైనంత వరకు దోచుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. భవిష్యత్తులో వైఎస్ఆర్‌సీపీ నాయకుల‌పై ప్రతీకారం తీర్చుకుంటామని బాబు హెచ్చరించారు.

ఇదే విష‌య‌మై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి మైనింగ్ మాఫియాను బహిర్గతం చేసేంత వరకు తాను విశ్ర‌మించేది లేద‌ని లోకేష్ అన్నారు. ఈ అక్ర‌మానికి పాల్ప‌డుతున్న వాళ్ల‌ను జైలుకు పంపేంత వ‌ర‌కూ ఊరుకోన‌ని అన్నారు.