Begin typing your search above and press return to search.

మమత దెబ్బతో... బాబుకు డిమాండ్... ?

By:  Tupaki Desk   |   4 Dec 2021 11:30 PM GMT
మమత దెబ్బతో... బాబుకు డిమాండ్... ?
X
మమతా బెనర్జీ. బెంగాల్ బెబ్బులి. ముచ్చటగా మూడవసారి ఆమె గెలిచి పశ్చిన బెంగాల్ లో విజయపతాకను ఎగరేసింది. మోడీ అమిత్ షా కూడబలుక్కుని వచ్చినా అక్కడ ఆమె జోరుని ఆపలేకపోయారు. గెలిస్తే నేను పీఎం పీఠానికే గురి పెడతాను అని నాడే చెప్పిన మమతమ్మ ఇపుడు అదే పని చేస్తున్నారు. 2024 నుంచి తాను ఢిల్లీలోనే ప్రధాని హోదాతోనే అంటున్నారు. మమత తాజా ఢిల్లీ టూర్ తో బీజేపీలో కలవరం చెలరేగింది. ఆమె తలచుకుంటే ఎర్రకోట ఖిల్లాకే క్వీన్ అవుతారు అన్న సత్యం కమలనాధులకు అర్ధమైపోయింది.

పైగా నానాటికీ వెలుగు దిగదుడుపు అని అన్నమయ్య కీర్తనను మార్చిపాడుకుంటోంది బీజేపీ. ఏవీ తల్లీ 2014 నాటి విజయ వైభవాలూ అని కాషాయదళం కల్లోలపడుతున్న వేళ మమతా బెనర్జీ చేసిన రీ సౌండ్ వచ్చే ఎన్నికల మీద ఆశలను ఇంకా దూరం చేస్తోంది. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడతామని మమత ప్రకటించారు. ఈ ప్రకటన నిజంగా అధికారంలో ఉన్న వారికి వెన్నులో వణుకు పుట్టించేదే.

సరిగ్గా దీంతోనే కమలదళం రాజకీయం కూడా మారుతోంది. అకాళీదళ్ సహా ఎన్డీయే కూటమిని విడిచి వెళ్ళిన పార్టీలను కలుపుకుంటామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఇక మమత జోరు ఇప్పటిదాకా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు వంటి నాయకులకు కూడా ఘనస్వాగతం పలికేలా చేస్తోందిట. ప్రాంతీయ పార్టీలతో కూటమి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబే. ఆయన తిమ్మిని బమ్మి చేయగల సిద్ధ హస్తుడు. బాబు ఉండాలే కానీ కుడి ఎడమలు సైతం ఒక్కటి అయిపోతాయి. ఎంత రాజకీయం అనుకున్నా పట్టు విడుపులు ఉన్న వారిని సైతం సర్దిచెప్పి ఒక వైపునకు తిప్పే చాతుర్యం మాత్రం అచ్చంగా చంద్రబాబుదే.

మమత ఏ స్టేట్మెంట్ ఇచ్చినా బీజేపీ పెద్దల ఆలోచనలు మాత్రం బాబు వైపే ఉన్నాయట. మమత కూటమిలో బాబు కలసినా లేక బాబే స్వయంగా రంగంలోకి దిగినా వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు తెచ్చుకున్నా కూడా బీజేపీకి అధికారం అందని పండే అన్నది చరిత్ర తెలిసిన కమలనాధుల భావంగా ఉందిట. దాంతో ఇపుడు ఢిల్లీలో బాబుకు పరపతి పెరుగుతోంది అంటున్నారు.

బాబు ఈ రోజుకీ విపక్ష కూటమి గురించి బాహాటంగా మాట్లాడడంలేదు. ఆయన ఆ వైపు మద్దతుగా నిలవడానికీ సిధ్ధంగా లేరు. ఆయన చూపు అంతా ఏపీ మీదనే ఉంది. ముందు జగన్ని గద్దె దించాలి. ఆ విషయంలో కేంద్రంలోని బీజేపీ సహకరిస్తే వారితో చేతులు కలిపేందుకు రెడీ అన్నదే బాబు మార్క్ పాలిటిక్స్. బీజేపీకి కూడా ఏపీలో పవర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవు. పైగా అక్కడ ఎవరూ మిత్రులు కూడా కాదు.

అందుకే బాబు వైపు బీజేపీ చల్లని చూపులు ప్రసరిస్తున్నాయని అంటున్నారు. తొందరలొనే ఏపీకి సంబంధించి కీలకమైన రాజకీయ సమీకరణలే మారుతాయని అంటున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ కోర్ కమిటీలో ఒకనాడు బాబుతో బాగా ఉన్న మాజీ తమ్ముళ్ళు, బాబుకు అనుకూలురు అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇక కేంద్రం నుంచి వైసీపీకి వరసగా షాకులు కూడా తగలడం మొదలైపోతోంది.

కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తాజాగా కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో చేసిన కామెంట్స్ వరదల్లో పెద్ద ఎత్తున జనాలు మరణాలకు వైసీపీ సర్కార్ వైఫల్యమని ఆరోపించడానికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో తమ దోస్త్ ఎవరో బీజేపీ ఇలా మెల్లగా చెప్పకనే చెబుతోంది. అంతే కాదు, ఏపీ సర్కార్ కి ఇబ్బందులు కూడా మొదలయ్యాయని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ జోరు పెరిగితే మాత్రం జాతీయ స్థాయిలో 2024 ఎన్నికల సంగతి ఎలా ఉన్నా ఏపీలో జగన్ కి పొలిటికల్ గా సినిమా చూపించేందుకు బాబు రెడీ అయిపోతారన్నది వాస్తవం.