Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సైకో.. త‌రిమి కొట్టే టైం వ‌చ్చింది: చంద్ర‌బాబు హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   10 Dec 2022 5:30 AM GMT
జ‌గ‌న్ సైకో.. త‌రిమి కొట్టే టైం వ‌చ్చింది:  చంద్ర‌బాబు హాట్ కామెంట్స్‌
X
టీడీపీ అధినేత‌ చంద్రబాబు ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను సైకోతో పోల్చారు. రాష్ట్రంలో సైకో పాలన సాగుతోందని దుయ్య‌బ‌ట్టారు. ''ఈ సైకో జ‌గ‌న్‌ను త‌రిమి కొట్టే టైం వ‌చ్చింది'' అని పిలుపునిచ్చారు. సంక్షేమం పేరిట దోపిడీ జరుగుతోందని చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇస్తే.. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుకను 6 వేల రూపాయ‌ల‌కు కొనాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.

రాష్ట్రాభివృద్ధి కోసమే అమరావతిని ప్రారంభించాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అమరావతి బిల్లుకు జగన్ కూడా మద్దతు తెలిపారని అన్నారు. ఇప్పుడు మూడు రాజధానులంటున్నారని విమ‌ర్శించారు.

తెలంగాణలోని 7 మండలాలు ఏపీలో కలపాలని పట్టుబడి సాధించిన విష‌యాన్ని గుర్తు చేసిన చంద్ర‌బాబు... ఆ మండలాలు కలవకపోతే పోలవరం ప్రాజెక్టు లేదన్నారు. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశామ‌ని, సైకో ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అని పనులు ఆపేసారని దుయ్య‌బ‌ట్టారు.

పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ వచ్చాక రెండు కళ్లు పొడిచేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఐదేళ్లలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామ‌ని చెప్పారు. మరో రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంద‌న్నారు. కానీ, కంపెనీలను బెదిరించి తరిమేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త‌ మూడేళ్లల్లో రూ 5.50 లక్షల కోట్ల అప్పు చేశార‌ని అన్నారు. సైకో పాలనకు జనమే చరమగీతం పడాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

పోలవరం పూర్తి చేసి ఉంటే రైతులు ఇప్పుడు తుపానులకు భయపడాల్సిన పని ఉండేది కాదని చంద్రబాబు అన్నారు. బాపట్లలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో ముంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో 10 రూపాయలు ఇచ్చి జగన్ వంద రూపాయలు దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

మాటి మాటికి సంక్షేమం అంటున్న సీఎం.. అన్న క్యాంటీన్లను ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని చెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.