అమరావతిని ప్రకటించండి.. పదవులు వదిలేస్తా: చంద్రబాబు

Wed Aug 05 2020 23:01:32 GMT+0530 (IST)

Announce Amravati .. We Will resign: Chandrababu

రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ ఏపీలో జరుగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతినే రాజధానిగా ప్రకటించండని.. పదవులను వదిలేస్తానంటూ చంద్రబాబు తాజాగా జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. 2014లోనే అన్యాయం జరిగిందని.. మళ్లీ మళ్లీ ఏపీ ప్రజలు మోసపోవడం తగదని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జూమ్ యాప్ లో బాబు విలేకరులతో మాట్లాడారు. ప్రజలను నమ్మించి మోసం చేశారని.. అమరావతిని ఎన్నికల ముందు సపోర్టు చేసి ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

వైసీపీ నాయకులు మాట తప్పి మడమ తిప్పారని బాబు ఆరోపించారు. వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. ఇలాంటి నాయకులకు బుద్ది చెప్పే పరిస్థితి రావాలని పేర్కొన్నారు. అమరావతికి 30వేల ఎకరాలు కావాలని నాడు అసెంబ్లీలో జగన్ చెప్పారా లేదా అని ప్రశ్నించారు. అమరావతిని నాశనం చేస్తారని ఎన్నికలకు ముందే తాను చెప్పానని బాబు గుర్తు చేశారు.

అమరావతిపై ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దామని.. రండి అని సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలని.. కేంద్రం జోక్యం చేసుకొని రాజధానిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని విమర్శించారు. రాజధాని మార్చే అధికారం వైసీపీకి లేదన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో అమరావతి కోసం పోరాటం ఉధృతం చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే మా పదవులు వదిలేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇక రామాలయానికి భూమి పూజ శుభకరమని.. రామాలయం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని చంద్రబాబు తెలిపారు.