Begin typing your search above and press return to search.

తారక్ తో సంధికి బాబు సిద్ధమయ్యారా?

By:  Tupaki Desk   |   19 Aug 2019 4:57 AM GMT
తారక్ తో సంధికి బాబు సిద్ధమయ్యారా?
X
కరివేపాకు ప్రాధాన్యం తెలియని వారు ఉండరు. కూర ఎంత బాగా చేసినా.. కరివేపాకు లేకుంటే ఏదో లోటుగా ఉండటం ఖాయం. అదే సమయంలో అంత మంచి కూరను తినేటోళ్లు.. కరివేపాకు తినే విషయానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూడదు. కూరలో కరివేపాకు ముఖ్యమే.. కానీ.. దాని వాడుకొని వదిలేయటమే కానీ.. దానికివ్వాల్సిన క్రెడిట్ మాత్రం ఇవ్వరు. ఇంచుమించు ఇదే పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ ది కూడా అని చెప్పాలి.

ఎన్టీఆర్ పోలికలే కాదు.. అంతటి వాగ్దాటి తారక్ సొంతం. 2009 ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి కొత్త శక్తిని.. ఉత్సాహాన్ని ఇవ్వటంలో కీలక పాత్ర పోషించారు. కానీ.. అతని పాత్ర బాబు నిర్దేశించినంత వరకే తప్పించి.. తన రాజకీయ వారసుడ్ని తలదన్నేలా అంటే మాత్రం బాబు ఊరుకోలేని పరిస్థితి. అందుకే.. తారక్ కు వచ్చిన ఇమేజ్ ను జీర్ణించుకోలేని బాబు.. ఆయన్ను పార్టీకి దూరంగా పెట్టారంటారు.

2014 ఎన్నికల్లో పవన్ పుణ్యమా అని.. తారక్ అవసరం బాబుకు పెద్దగా లేకుండా పోయింది. పవర్ లో ఉన్నప్పుడు బాబుకు చాలామంది గుర్తుకు రారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాయం అందించిన తారక్ లాంటోళ్లు అస్సలు కనిపించరు. కానీ.. దిమ్మ తిరిగేలా ఓటమి గట్టి దెబ్బేసినప్పుడు మాత్రం.. తనకెవరు కావాలి? పార్టీ అవసరం ఎవరితో ఉందన్న విషయాల్ని చప్పున గుర్తు చేసుకోవటంలో మాత్రం బాబు దిట్టగా చెప్పాలి. ప్రస్తుతం పీకల్లోతు ఓటమి కష్టాల్లో కూరుకుపోవటం.. మరోవైపు జగన్ దూకుడ్ని తట్టుకునే శక్తియుక్తులు సన్నగిల్లటం.. తానెంతో ఆశలు పెట్టుకున్న తన రాజకీయ వారసుడి సామర్థ్యం ఎంతన్న విషయంపై క్లారిటీ వచ్చేసిన చంద్రబాబు.. మళ్లీ మొదటికి వచ్చారు.

పార్టీకి ప్రస్తుతం తారక్ లాంటి వారి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. తన బావమరుదుల్లో ఒకరైన నందమూరి హరి కృష్ణ ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లారు చంద్రబాబు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక్కడే ఒక విశేషం చోటు చేసుకుంది. చంద్రబాబు వెళ్లిన సమయంలో హరి కృష్ణ ఇంట్లో వారి కుమారులు కల్యాణ్ రామ్ తో పాటు.. తారక్ కూడా ఉన్నారు. బాబును రిసీవ్ చేసుకున్న వారు.. ఆయనతో కాసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది.

వీరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఎదురైన ఓటమి కారణంగా తన బలం.. బలహీనతను గుర్తించిన బాబు.. తారక్ ను పార్టీలో కీలకభూమిక పోషించాలని అడిగి ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. టీడీపీ ప్రస్తుత పరిస్థితిపై తారక్ సైతం బాధలో ఉన్నారని.. ఎలా అయినా తాత పార్టీని కాపాడుకోవాలన్న భావన ఆయనలో ఉందని.. అలా అని తొందరపడి నిర్ణయం తీసుకోవటం ఇష్టం లేదన్న మాట వినిపిస్తోంది. రోడ్డుప్రమాదంలో హరి కృష్ణ మరణించిన సమయంలో అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించిన చంద్రబాబు.. వారి కుటుంబానికి అండగా నిలవటాన్ని మర్చిపోలేదు.

ఆయన భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చిన కేటీఆర్ తో పొత్తుల విషయాన్ని ప్రస్తావించి రాజకీయంగా భారీ విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు.. తాజాగా అదే హరి కృష్ణ ప్రధమ వర్థంతి సందర్భంలో తారక్ ను కలవటం ఇప్పుడు అందరి చూపులు వీరి మీటింగ్ మీద పడేలా చేసిందని చెప్పాలి. పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలంటే బాబుకున్న అప్షన్లలో తారక్ ఒకరని చెబుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న తారక్ ను పార్టీలో క్రియాశీలకంగా చేయటంలో బాబు ఎంతమేర సక్సెస్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అయితే.. అందరూ అనుకున్నట్లుగా చేయటానికి తారక్ ఎంతమేర సిద్దమన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.