Begin typing your search above and press return to search.

యంగ్ బాబు : ఇప్పటికింకా నా వయసు జస్ట్...?

By:  Tupaki Desk   |   19 May 2022 6:40 AM GMT
యంగ్ బాబు : ఇప్పటికింకా నా వయసు జస్ట్...?
X
వయసు ఒక పాదరసం అని కవులు చెబుతారు. అవును పాదరసం మాదిరిగా అది చూస్తూండగానే జారిపోతుంది. ఇక ఇంకో నగ్న సత్యం ఏంటి అంటే వయసు పెరిగిందంటే ఎవరూ కూడా కలలో కూడా అసలు ఒప్పుకోరు. దాన్ని చాలా కన్వీనియెంట్ గా సైడ్ చేసేస్తారు. వయసు గోల ప్రతీ మనిషిలో ఉంటుంది.

ఇక ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న సినీ రాజకీయ రంగాలలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. షష్టి పూర్తి అయిన వారు కూడా ఇంకా తాము నాటౌట్ అని రెండు రంగాల్లో అంటూ ఉంటారు. ఇక ఇపుడు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కూడా వయసు గురించి మధన పడుతున్నారా అన్న సందేహాలు వచ్చేలా ఆయన లేటెస్ట్ కామెంట్స్ ఉన్నాయి.

కడప జిల్లా టూర్ లో చంద్రబాబు చేసిన కామెంట్స్ కాస్తా ఆసక్తిగానే కాక వ్యూహాత్మ‌కంగానే ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు తమ్ముళ్ళూ నా వయసు ఇపుడు డెబ్బై రెండూ. కానీ నేను జస్ట్ 27 ఏళ్ళ వాడిని మాత్రమే అని ట్విస్ట్ ఇచ్చారు. మీ కంటే కూడా చురుకైన వాడిని. నవ యువకుడిని అని కూడా బాబు అన్నారు.

ఆ విధంగా తాను యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ ని అని బాబు చెప్పేసుకున్నారు అన్న మాట. తాను ఈ రోజుకీ డైనమిక్ గా ఉంటానని, అవసరం అనుకుంటే తన నిద్రను కూడా మానుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతాను అని కూడా బాబు చెప్పారు. అక్కడ ఉన్న యువతను ఉత్సాహపరచారు. మరి సడెన్ గా బాబు నోటి వెంట ఈ ఏజ్ కామెంట్స్ ఎందుకు వచ్చాయని ఆలోచించాలి.

నిజానికి చూస్తే ఏపీ పాలిటిక్స్ లో సీఎం జగన్ వయసు 49 ఏళ్ళు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ వయసు 51 ఏళ్ళు. ఈ ఇద్దరూ రాజకీయంగా చూస్తే యువకులు కిందనే లెక్క. మరి వారితో పోల్చితే ఏడు పదులు దాటిన బాబు సీనియర్ సిటిజన్ కిందనే జమ కడుతున్నారు. అంతే కాదు వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు వయసు అయిపోయింది, అలాగే టీడీపీ పని ఇక సరి అని చాలా కాలంగా కామెంట్స్ చేస్తూ వస్తోంది.

దాంతో ఈ తరహా కామెంట్స్ ని తిప్పికొట్టడానికి, తాను మరో పదేళ్ళ పాటు ఏపీకి నాయకత్వం వహించగలను అన్న సందేశాన్ని ఇవ్వడానికి చంద్రబాబు కడప వేదికను వాడుకున్నారు. అది కూడా జగన్ సొంత జిల్లా కావడంతో అక్కడే ఆయన బిగ్ సౌండ్ చేసి మరీ జగన్ కి ఆయన పార్టీకి గట్టి జవాబు ఇచ్చారు అనుకోవాలి.

ఏది ఏమైనా భారత దేశ రాజకీయాల్లో ఉన్న వారికి రిటైర్మెంట్స్ లేవు కదా. పైగా ప్రజలు ఎంతకాలం వారిని కోరుకుంటే అంతకాలం వారు నాయకులుగా ఉంటారు. ఇందులో భయపడాల్సింది బెంగ పడాల్సినది కూడా ఏమీ లేదు. మొత్తానికి చూస్తే బాబు నేను నాటౌట్ అని యంగ్ బాయ్ నే అని అంటున్నారు. మరి ఆయన పరుగు అందుకోవడానికి జగన్, పవన్ పోటీ పడతారా.