Begin typing your search above and press return to search.

బాబు మారిపోయారు .... జేసీలకు ఝలక్ ...?

By:  Tupaki Desk   |   6 Dec 2022 10:30 AM GMT
బాబు మారిపోయారు .... జేసీలకు ఝలక్ ...?
X
చంద్రబాబు మారిపోయారు అని తమ్ముళ్ళు ఇపుడు అంటున్నారు. గతంలో తాను మారాను అని పదే పదే బాబు చెప్పినపుడు ఎవరూ అలా అనుకోలేదు. అన్నీ చెప్పిన బాబు తీరా మ్యాటర్ లోకి వచ్చేసరికి సీనియర్లు ఎలా కోరితే అలా అన్నట్లుగా ఉండేవారు. దాంతో వారి పని హ్యాపీగా ఉండేది. ఇపుడు అలా కాదు సీన్ మొత్తం మారింది. బాబు పూర్తిగా మారిపోయారు.

బాబుకు 2024 ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో తిరిగి గెలిస్తేనే పార్టీకి తనకు అంతా మంచిది అని ఆయన కంటే ఎవరికీ తెలియదు. దాంతో బాబు చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికలు బాబుకు ఎంతటి ప్రతిష్టాత్మకమో చెప్పాలంటే రెండు విషయాలు చూడాలి. ఒకటి నిండు అసెంబ్లీలో బాబు ఫ్యామిలీని వైసీపీ వారు అవమానించారు అని బోరున విలపించారు పెద్దాయన.

అదే ఆవేశంలో తిరిగి కౌరవ సభను గౌరవ సభగా మార్చి తాను సీఎం అయ్యాకనే అసెంబ్లీలోకి అడుగుపెడతాను అని బాబు శపధం చేశారు. ఇది ఎవరో అన్న మాట కాదు, బాబు చేసిన భీకర శపధం. మరి దానిని నేరవేర్చేందుకు బాబు కష్టపడాలి కదా. అదే విధంగా అమరావతి రాజధాని బాబు కలల రాజధాని. ఆ రాజధానిని వైసీపీ వచ్చాక చిద్రం చేసి పారేసింది. అదే విధంగా అనేక కీలక ప్రాజెక్టులు కూడా అటకెక్కాయి. దాంతో వాటిని తాను వస్తే చేపడతాను ఏపీని మొత్తం గాడిలో పెడతాను అని బాబు అంటున్నారు.

ఆ విధంగా బాబు రెండు కీలకమైన విషయాల్లో పంతం మీద ఉన్నారు. అందువల్ల ఆయన ఈసారి సీఎం కావాలన్నది కచ్చితంగా ఆయనకూ టీడీపీకి అవసరం. ఇక ఏపీ రాజకీయ వాతావరణం తీసుకుంటే వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీ అధికారంలో ఉంది. డబ్బు, అంగబలం, అధికారం అన్నీ ఉన్న వైసీపీని ఓడించాలి అంటే పేలవమైన వ్యూహాలు పనిచేయవు. మొహమాటాలు అంతకంటే పనిచేయవు.

మొత్తానికి మొత్తం అన్ని సీట్లలోనూ బలమైన అభ్యర్ధులను నిలబెట్టి వైసీపీని ఢీ కొట్టాల్సి ఉంటుంది. దాంతో చంద్రబాబు ఇపుడు ఏ ఒక్క నియోజకవర్గాన్ని లైట్ తీసుకోవడంలేదు అని అంటున్నారు. అందులో భాగంగా ఆయన అనంతపురం జిల్లాలోని జేసీ బ్రదర్స్ కి కూడా గట్టిగా చెప్పాల్సింది చెప్పేశారు అని అంటున్నారు. నిజానికి సీనియర్ జేసీలు తమ వారసులను బరిలోకి దించాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకరరెడ్డిల కుమారులు ఇద్దరూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడారు.

ఈ మూడున్నరేళ్లలో వారు ఏ మాత్రం తమ గ్రాఫ్ ని పెంచుకోలేకపొయారు. కేరాఫ్ సీనియర్ జేసీస్ అన్నట్లుగానే కధ సాగుతోంది. దాంతో వారికి టికెట్లు ఇవ్వడం కుదరదు అని బాబు చెప్పేశారు అంటున్నారు. 2014లో మాదిరిగా దివాకరరెడ్డి అనంతపురం ఎంపీగా, తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకరరెడ్డి పోటీకి దిగాలని బాబు సూచించారు అని తెలుస్తోంది. దాంతో ఏడు పదులు దాటిన వయసులో సీనియర్ జేసీలు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక గమ్మున ఉంటారా అన్నదే చర్చగా ఉందిట. మరి వారి వారసులకు టికెట్ అంటే ఆ మాటను మరచిపోవాల్సిందే అంటున్నారుట. మొత్తానికి బాబు మార్క్ డెసిషన్స్ ఏంటో ఇపుడు టీడీపీలో తమ్ముళ్ళు అంతా చూస్తున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.