మోడీకి నచ్చని పేరుతో ఆయనను పోల్చిన చంద్రబాబు!

Tue Aug 16 2022 10:59:15 GMT+0530 (IST)

ChandraBabu Naidu Compares Modi With

కాంగ్రెస్ ముక్త్ భారత్ (కాంగ్రెస్ లేని దేశం) గా దేశాన్ని చేయాలని బీజేపీ అధిష్టానం కంకణం కట్టుకుంది. ఈ దిశగా ఇప్పటికే చాలావరకు విజయవంతమైంది. కాంగ్రెస్ ను కేవలం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ విధానాలతో దేశం బాగా నష్టపోయిందనేది బీజేపీ నేతల నమ్మకం. నెహ్రూ ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రోద్యమంలో అసలు సిసలైన సమరయోధులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ దామోదర్ వీర సావర్కార్ బాలగంగాధర్ లాలాలజపతిరాయ్ బిపిన్ చంద్రపాల్ ను విస్మరించాయనేది బీజేపీ ప్రధాన ఆరోపణగా ఉంది. కేవలం నెహ్రూ ఒక్కడే స్వాతంత్య్రోద్యోమంలో కీలకమన్నట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని బీజేపీ ఇప్పటికీ ఆరోపణలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగంలో నెహ్రూ పేరును కూడా తీశారు. బ్రిటిష్ వలసపాలన తర్వాత దేశాన్ని నెహ్రూ పీవీ నరసింహారావు వాజపేయి మోడీ వంటి వారు చక్కదిద్దారని కొనియాడారు.

అయితే ఎవరి పేరును అయితే ఉచ్ఛరించడానికి కూడా బీజేపీ ఇష్టపడటం లేదో అదే నెహ్రూ పేరును మోడీతో పోల్చి చంద్రబాబు చెప్పడాన్ని బీజేపీ ఎలా చూస్తోందోనని అంటున్నారు.. విశ్లేషకులు. అందులోనూ గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పార్టీతో కలసి దేశంలో ముందుకెళ్లారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా పార్టీల మద్దతును కూడగట్టారు. అయితే చంద్రబాబు ప్రయత్నం సత్ఫలితం ఇవ్వలేదు. కాంగ్రెస్ గత ఎన్నికల్లోనూ 2014 మాదిరిగానే చతికిలపడింది.

దీంతో అప్పటి నుంచి చంద్రబాబు కూడా కాంగ్రెస్ కు దూరంగా జరిగి బీజేపీకి దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో పాల్గొనడానికి డిల్లీ కూడా వెళ్లారు. ప్రధాని మోడీతోనూ సంభాషించారు. ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీ క్యాంపు ఇష్టపడని నెహ్రూ పేరును తాజాగా జెండా ఆవిష్కరణ సభలో పేర్కొన్నారు.

ఇప్పటికే కొద్ది రోజుల క్రితమే జవహర్ లాల్ నెహ్రూ పేరును చరిత్ర నుంచి తొలగించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవం కూడా అదేనంటున్నారు.. విశ్లేషకులు. నెహ్రూని ఆయన వారసులను తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరినీ ఎదగనీయలేదనే బీజేపీ ప్రధాన ఆరోపణ.

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి మళ్లీ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. నరేంద్ర మోడీ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయకుండా ఆయనను నెహ్రూతో కలిపి సంబోధించడాన్ని హర్షించరేమోనని అంటున్నారు. రాజకీయ నేతలు ప్రసంగించేటప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా.. తాము దగ్గరవ్వాల్సిన వాళ్లకు నచ్చినట్లు మాట్లాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఒకవేళ చంద్రబాబు.. నరేంద్ర మోడీని పొగడాలని అనుకున్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటివారితో పోల్చితే ఆయన తప్పక సంతోషించేవారని అంటున్నారు. అలా కాకుండా నెహ్రూతో పోల్చి చంద్రబాబు మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారని నిట్టూరుస్తున్నారు.

పీవీ నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఆయనను ఆ పార్టీ తీవ్రంగా అవమానించిందని అంటున్నారు. చివరకు ఆయన కన్నుమూస్తే ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో కూడా ఆయన భౌతిక కాయాన్ని కూడా ఉంచనీయలేదు. దేశాన్ని పాలించి మరణించిన అందరూ ప్రధానుల సమాధులు ఢిల్లీలోనే ఉన్నాయి. ఒక్క పీవీ నరసింహారావుకు తప్ప. ఈ విషయంలో పీవీపైన బీజేపీకి సానుభూతి ఉంది. కాబట్టి పీవీ నరసింహారావుతో తనను పోల్చి చూడటాన్ని మోడీ పెద్దగా అభ్యంతరపెట్టకపోవచ్చని చెబుతున్నారు.

అయితే మొత్తం మీద బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు అనుకుంటుంటే కనుక ఆయన మాట్లాడేటప్పుడు సోషల్ మీడియాలో ఏవైనా పోస్టు చేసేటప్పుడు నిష్ణాతుల సూచనలు సలహాలు తీసుకోవడం అవసరం అంటున్నారు. బీజేపీ అధిష్టానానికి ముఖ్యంగా ప్రధాని మోడీకి ఏది నచ్చుతుందో దాన్నే చంద్రబాబు మాట్లాడాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలా అయితేనే చంద్రబాబుకు మోడీతో పూర్వ సంబంధాలు చిగురిస్తాయని అని పేర్కొంటున్నారు.