Begin typing your search above and press return to search.

బాబు చేయ‌నిది... కేటీఆర్ -జ‌గ‌న్ చేసింది ఇదే

By:  Tupaki Desk   |   20 Jan 2019 4:21 PM GMT
బాబు చేయ‌నిది... కేటీఆర్ -జ‌గ‌న్ చేసింది ఇదే
X
రాజ‌కీయ చాణ‌క్యుడిగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు దురుద్దేశపూరిత త‌త్వం మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది. ఇంకా చెప్పాలంటే... తాను చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్య‌భిచారం అన్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించే తీరు బ‌ట్ట‌బ‌య‌లు అయింది. టీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహ న్‌రెడ్డితో జరిపిన సమావేశం గురించే ఇదంతా. తెలంగాణ, ఏపీ రాష్ర్టా ల ఎంపీలు పార్లమెంట్‌ లో సమన్వయంతో వ్యవహరిస్తే బలమైన జట్టుగా ఏర్పడి తమ డిమాండ్లను సులభంగా సాధించుకోవచ్చు. ప్రతిదానికి కేంద్రాన్ని బతిమాలుకోవలసిన దుస్థితి ఉండదు. తెలంగాణ, ఏపీలలోని రాజకీయపక్షాల మధ్య సత్సంబంధాలు నెలకొంటే రెండు రాష్ర్టాలను వేధిస్తున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇది ఈ ఇద్ద‌రు నేత స‌మావేశం యొక్క ఎజెండా సారాంశం.

మ‌రోవైపు కేటీఆర్-జగన్ భేటీ వల్ల ఏ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం లేదు. అయినా ఈ భేటీపై టీడీ పీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరగణాలు కొంపలు మునిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఇరువురు యువనాయకుల భేటీ ఇంతకాలం చంద్రబాబు అనుసరించిన కుత్సిత రాజకీయాలకు భిన్నంగా ఉండటం వల్లనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నిక లు సమీపించినప్పుడు, బాబ్లీ ప్రాజెక్టు దగ్గరకు పోయి చొక్కా చింపుకొని ప్రజలను రెచ్చగొట్టాలనుకోవడం చంద్రబాబు తరహా రాజకీయం. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సంబంధించి ముంబై వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా చర్చించి ఒప్పందం కుదుర్చుకోవడం కేసీఆర్ తరహా రాజనీతి. ఈ దృక్కోణంలో తేడానే కేటీఆర్-జగన్ భేటీపై చంద్రబాబు చిందులు వేయడానికి కారణం. మ‌రోవైపు వారి గురివింద నీతి. ఇదే తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు తాము టీఆర్ ఎస్‌ తో పొత్తుకు ప్ర‌య‌త్నించామ‌ని, అయితే కేసీఆర్ అంగీక‌రించ‌లేద‌ని బాహాటంగా ప్ర‌క‌టించారు. ఆనాడు ఆయ‌నకు మంచి అయిన టీఆర్ ఎస్ నేడు వైసీపీ నేత‌తో స‌మావేశం అవ‌గానే... పొత్తు ప్ర‌స్తావ‌న రాక‌పోయినా...ఏపీ వ్య‌తిరేకిగా మారిపోయింది! కాదు.. బాబు బ్యాచ్ ద్వారా మార్చ‌బ‌డింది.

మ‌రో విచిత్రంగా చంద్ర‌బాబు స్వార్థ‌పూరిత రాజ‌కీయాల‌ను ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఏదో ఒక జాతీయపార్టీని పట్టుకొని వేలాడాల‌నే పాతకాలపు మనో దౌర్బల్యంతోనే టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీని మోసినంత కాలం మోసి, ఇప్పుడు యూపీఏ పల్లకీని మోస్తున్నాడు. కాంగ్రెస్ కూటమిలో కొనసాగుతూ అందుకు అనుగుణంగా వివిధ పార్టీల నాయకులను వెళ్ళి కలుసుకున్నా డు. ఫెడరల్ స్ఫూర్తితో సాగుతున్న యత్నాలను హర్షించాలనే సోయి కూడా కలుగడం లేదు.అదే స‌మ‌యంలో, తెలంగాణ ఉద్యమ విలువలు, టీఆర్ ఎస్ సమర్థవంతమైన పాలన నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు కూడా తమ రాష్ట్ర రాజకీయాలను కొత్త కోణంలో చూస్తున్నారు. తెలంగాణ నాయకులకు సౌహార్ద్ర స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్సార్సీపీ చర్చలు కూడా జరుపుతుండటంతో పాతకాలపు రోత రాజకీయాలకు అలవాటుపడిన చంద్రబాబుకు ఒంటినిండా జెర్రులు పాకినట్టుగా ఉన్నది. చంద్రబాబు వంటి కుటిల రాజకీయ నాయకులు, వారి గణాలు ఎంత మొత్తుకున్నా, తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య సంఘీభావాన్ని పెంపొందించి, అభివృద్ధిపథంలో నడిపించవలసిన బాధ్యత రెండు రాష్ర్టాల్లోని బాధ్యతాయుత రాజకీయపక్షాలపై ఉంద‌ని, ఈ విష‌యం ఏపీ ప్ర‌జ‌లు గమ‌నిస్తున్నార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.