Begin typing your search above and press return to search.

తమ్ముళ్లకు బాబు కీలక సూచన.. ఎన్నికల వేళ అలా చేయాలట

By:  Tupaki Desk   |   23 Jan 2021 4:10 AM GMT
తమ్ముళ్లకు బాబు కీలక సూచన.. ఎన్నికల వేళ అలా చేయాలట
X
ఓవైపు జగన్ సర్కారుకు.. ఏపీ ఎన్నికల కమిషన్ కు మధ్య లేఖల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. పంచాయితీ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలన్నది నిమ్మగడ్డ లక్ష్యమైతే.. ఇప్పటికైతే వద్దు.. వ్యాక్సినేషన్ తర్వాతే అంటూ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల్ని నిర్వహించాలన్న కోర్టు మాటతో.. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే వీలుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎస్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి.. వాయిదా అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చారు.

ఇలాంటి పరిణామాలతో సంబంధం లేని చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు సరికొత్త ఆదేశాన్ని ఇచ్చారు. అన్ని పంచాయితీల్లో అభ్యర్థులు బరిలో ఉండాలని.. ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలకు జరగకుండా చూడాలన్న ఆయన.. ప్రతి అంశాన్ని మొబైల్ లో రికార్డు చేసి.. ఆ వీడియో ఫుటేజ్ ను టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే ఎన్నికలకు వెనుకాడుతున్నట్లుగా బాబు వ్యాఖ్యానించారు.

శనివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు నిమ్మగడ్డ ఏర్పాట్లు చేస్తున్న వేళలో.. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారించినా పెద్దగా ప్రయోజనం ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక.. సుప్రీంకోర్టు సైతం దాన్ని ఆపలేదని నిపుణుల మాటగా వినిపిస్తోంది. దీంతో.. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని భావిస్తున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. ప్రతి విషయాన్ని రికార్డు చేయటం టీడీపీ శ్రేణులు తప్పనిసరిగా చేశారని.. వాటితో ప్రజల ముందుకు ఏం జరుగుతుందన్న విషయం మీద పూర్తి అవగాహన వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. బాబు ఐడియా ఎలా వర్కువుట్ అవుతుందో చూడాలి.