రాష్ట్ర ఎన్నికల సంఘంపై బాబు ఫైర్

Tue Feb 23 2021 11:00:01 GMT+0530 (IST)

Chandra Babu Fires On State Election Commision

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల విషయంలో ఎన్నికల సంఘం సమర్థంగా వ్యవహరించలేదన్నారు. అధికార పార్టీ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడితే అడ్డుకోవాల్సిన ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.ఎన్నికల సంఘం నిర్వీర్యమైపోయింది. లెక్కింపు కేంద్రాల్లో మాత్రమే కరెంటు పోతే సంబంధిత అధికారిని ఎస్ఈసీ అడగలేదా? నిబంధనలకు విరుద్ధంగా నాలుగుసార్లు రీకౌంటింగ్ చేస్తే.. సదరు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట వైసీపీ మద్దతుదారు గెలిచినట్లుగా ప్రకటించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వైకుంఠపురంలో టీడీపీ గెలుపును ప్రకటించేందుకు అర్థరాత్రి వరకు పోరాడాల్సి రావటం ఏమటి? అని నిలదీశారు.

బెదిరించి ఏకగ్రీవాలు చేశారని.. ఓటమిని అధిగమించేందుకు అర్థరాత్రి డ్రామాలకు తెర తీశారన్నారు. కరెంటు తీసేసి ఓటర్ స్లిప్పులు మార్చి వైసీపీ మద్దతుదారుల్ని గెలిపించారన్నారు. ఇలాంటి అక్రమాలు చేయాలనుకున్న చోట మళ్లీ ఓట్లను లెక్కించాలని అర్థరాత్రి వరకు సాగదీశారన్నారు. టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించేశారన్నారు. ఇలా అధికార పార్టీకి చెందిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. మరి.. బాబు చేసిన తీవ్ర ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.