Begin typing your search above and press return to search.

సైమండ్స్.. వేటాడేవాడు పరుగులను.. పందులను!

By:  Tupaki Desk   |   15 May 2022 8:30 AM GMT
సైమండ్స్.. వేటాడేవాడు పరుగులను.. పందులను!
X
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లాగే.. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ జీవితమూ అర్ధంతరంగా ముగిసింది. అద్భుత ఆటగాడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. వివాదాలతోనూ అంతే చెడ్డ పేరు మూటగట్టుకున్న సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం అభిమానులకు షాకిచ్చింది. ఆస్ట్రేలియాకు 1998-2009 మధ్య 26 టెస్టులు, 198 వన్డేల్లో సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు. లోయర్ మిడిలార్డర్ లో బ్యాట్స్ మన్ గా, మీడియం పేస్, అవసరమైతే స్పిన్ తో బౌలర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సైమండ్స్ వయసు 46 ఏళ్లు. 13-14 ఏళ్ల కిందటే ఆసీస్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు.

మంకీ గేట్ లో ప్రధాన పాత్రధారి

టీమిండియా 2007-08 మధ్య ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ''మంకీ గేట్'' వివాదం తలెత్తింది. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. సైమండ్స్ ను ఉద్దేశించి హిందీలో ''తేరే మా కీ'' అని సంబోధించడం.. అది ''మంకీ'' అని నిందించినట్లు బయటకు రావడం పెద్ద దుమారమే రేపింది. దీనికి సంబంధించి భజ్జీ పై నిషేధం విధించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.

టీమిండియా సిరస్ ను బహిష్కరించే వరకు వెళ్లింది. అయితే, ఆ చర్చల తర్వాత వివాదం సద్దుమణిగింది. కాగా, ఇదే సైమండ్స్ 2011 ఐపీఎల్ లో భజ్జీతో కలిసి ఆడడం విశేషం. చిత్రమేమిటంటే.. సైమండ్స్ టెస్టుల్లో చేసిన అత్యధిక స్కోరు 162. ఇది 2008 సిడ్నీ టెస్టులోనే కావడం గమనార్హం. వివాదాల్లో ఇదొక్కటే కాదు.. 2005లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు విపరీతంగా తాగడం, 2008లో టీమ్ మీటింగ్ ఉండగా దానిని కాదని చేపలు పట్టేందుకు వెళ్లడం, 2009 టి20 ప్రపంచ కప్ నకు ముందు అతిగా మద్యం తాగి జట్టు నుంచి బహిష్కరణకు గురవడం, ఆ తర్వాత ఏకంగా క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్టే రద్దవడం ఇలా అనేక సందర్భాల్లో సైమండ్స్ ప్రవర్తన వివాదాస్పదమైంది.

తొలి ఐపీఎల్ లో హైదరాబాద్ కు ప్రాతినిధ్యం

2004లో అంటే టి20ల కాలం ప్రారంభంలో సైమండ్స్ ఇంగ్లిష్ కౌంటీ జట్టు కెంట్ కు ఆడుతూ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో దక్కన్ చార్జర్స్ (ప్రస్తుత సన్ రైజర్స్ హైదరాబాద్) వేలంలో అతడిని రూ.1.35 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, 2009తో సైమండ్స్ కెరీర్ గాడితప్పింది. క్రమశిక్షణా రాహిత్యంతో ఆట కూడా దెబ్బతిన్నది. మధ్యలో కొన్నాళ్లు మాయమయ్యాడు. 2012 నుంచి కామెంటేటర్ గా మారిపోయాడు. 2003, 2007 ప్రపంచ కప్ లు నెగ్గిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యుడిగా, టెస్టుల్లోనూ కీలకంగా ఉంటూ వచ్చిన సైమండ్స్.. మంచి కెరీర్ ను తన చేతులతోనే దెబ్బతీసుకున్నాడు. తాజా రోడ్డు ప్రమాదంలో జీవితాన్ని అర్ధంతరంగా చాలించాడు.

ఆ ఇన్నింగ్స్ లు కీలకం

సిడ్నీ టెస్టులో భారత్ పై 162 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో పాటు మూడు వికెట్లు తీసిన సైమండ్స్ జట్టును గెలిపించాడు. 2003 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన స్థితిలో బరిలో దిగి 125 బంతుల్లో 143 పరుగులు చేశాడు సైమండ్స్. 2006 బాక్సింగ్ డే టెస్టులోనూ సెంచరీ కొట్టి ఇంగ్లండ్ పై ఆసీస్ ను గెలిపించాడు.

పందుల వేటగాడు.. గేల్ కంటే ముందే సోగ్గాడు

పొడవాటి జుట్టు దానికి రింగులతో మైదానంలో తనదైన హెయిర్ స్టయిల్ తో కనిపించేవాడు సైమండ్స్. వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ కంటే ముందే ఇలాంటి హెయిర్ స్టయిల్ ను ఫాలో అయ్యాడు సైమండ్స్. భిన్నంగా కనిపించే అతడి స్టయిల్ అందరినీ ఆకట్టుకునేది. కాగా, సైమండ్స్ కు క్రికెట్ తో పాటు వేట మహా ఇష్టం. మైదానంలో పరుగులను ఎలా వేటాడతాడో.. అడవిలో పందులనూ అలానే వేటాడేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.