ఆరుగురు కొత్త గవర్నర్లు...తెలంగాణ గవర్నర్ సేఫ్

Sat Jul 20 2019 18:02:18 GMT+0530 (IST)

గవర్నర్ల మార్పిడి విషయంలో గత కొద్దికాలంగా జరుగుతున్న ప్రచారం నియమైంది. ఒడిశాకు చెందిన బీజేపీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ గత మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే ఒరవడిలో కొన్ని కీలక రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొత్తవారిని గవర్నర్లుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్లుగా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి వీరి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గా ఆనందీబెన్ పటేల్ నియమించారు. మధ్యప్రదేశ్ నుంచి కీలక రాష్ట్రమైన యూపీకి ఆమెను బదిలీ చేశారు. బిహార్ గవర్నర్ గా ఉన్న లాల్ జీ టాండన్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. బిహార్ గవర్నర్ గా ఫగు చౌహాన్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా జగ్ దీప్ ధన్ ఖర్ నియమించారు. త్రిపుర గవర్నర్ గా రమేశ్ బయాస్ నాగాలాండ్ గవర్నర్ గా ఆర్ ఎన్ రవి నియామకం చేపట్టారు. కాగా తెలంగాణ గవర్నర్ మార్పు ఉంటుందనే ప్రచారం జరిగినప్పటికీ ఆయనకు స్థానచలనం జరగలేదు.

గవర్నర్ మార్పుపై టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించిన సంగతి తెలిసిందే. `గవర్నర్ ను మార్చడంపై సమాచారం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మన గవర్నర్ విచక్షణాధికారాన్ని సవ్యంగా వినియోగించుకున్నారు. గవర్నర్ వ్యవస్థల్లో తలదూర్చి ఏదో చేయడం ఉండదు. ` అంటూ ఈ ప్రచారంపై కేటీఆర్ స్పందించారు.