పవన్ కు కేంద్రమంత్రి పదవి నిజమేనా ?

Thu Jun 17 2021 15:10:39 GMT+0530 (IST)

Central Ministry to Pawan Kalyan ?

 మెగా బ్రదర్స్  కు సంబంధించి ఈమధ్య రెండు విషయాలు బాగా ప్రచారం అవుతున్నాయి. అవేమిటంటే మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ ఎంపి పదవి. ఇక రెండోది జనసేనాని పవన్ కల్యాణ్ కు కేంద్రంలో మంత్రిపదవి. నిజానికి రెండూ ఆశ్చర్యకమైన విషయాలే అనటంలో సందేహమే లేదు. ఆశ్చర్యం ఎందుకంటే రెండు విషయాలు కూడా ఊహించేందుకు కూడా లేదు కాబట్టే.మొదటిది చిరంజీవి విషయాన్నే చూస్తే రాజకీయాల్లోకి చేతులు కాల్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి నడపలేక జెండా ఎత్తేశారు. దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. రాజ్యసభ ఎంపి సభ్యత్వం అయిపోయిన తర్వాత రాజకీయాలతో సంబంధమే లేదన్నట్లుగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. అలాంటిది ఇపుడు రాజ్యసభ సభ్యత్వం తీసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ?

ప్రతిపక్షాల్లోని ఏ పార్టీ తరపున కూడా అవకాశం లేదు కాబట్టి వైసీపీ తరపునే రాజ్యసభ ఎంపి తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత ? ఇక పవన్ కల్యాణ్ విషయం చూస్తే కేంద్రంలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. జనసేనకు ఉన్నదే ఒక ఎంఎల్ఏ. ఆ ఎంఎల్ఏ కూడా పార్టీతో లేరు. పవన్ పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

మొన్నటి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీనేమైనా గెలిపించారా ? పవన్ ప్రచారం చేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు కదా. పవన్ కు కేంద్రమంత్రిని చేయటం వల్ల బీజేపీకి వచ్చే లాభం ఏమిటో ? అర్ధం కావటంలేదు. ఏరకంగా చూసినా పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వటానికి లాజిక్ కనబడటంలేదు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వటం వల్ల కాపులంతా వైసీపీకో లేకపోతే బీజేపీకో ఓట్లేసేస్తారా ? ఇది కూడా డౌటే.

ఎందుకంటే ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు చిరంజీవికైనా మొన్నటి ఎన్నికల్లో పవన్ కైనా కాపులు పూర్తి మద్దతు దొరకలేదన్నది వాస్తవం. కాపులే చిరంజీవి పవన్ను నమ్మి ఓట్లేయనపుడు ఇతర పార్టీలు వాళ్ళకు ఏమి చూసి పదవులిస్తాయి ? నిజానికి చిరంజీవికి రాజ్యసభని పవన్ కు కేంద్రమంత్రి పదవని మెగాబ్రదర్స్ కు దగ్గరగా ఉండే మీడియా మాత్రమే ఊదరగొడుతోంది. దీనికి ఢిల్లీ వర్గాలని విశ్వసనీయవర్గాలని కలరింగ్ ఇస్తోందంతే. చూద్దాం ఏమి జరుగుతుందో.