Begin typing your search above and press return to search.

టెన్షన్ పోయింది...ఆ 9 వేల మంది దొరికారు

By:  Tupaki Desk   |   2 April 2020 2:10 PM GMT
టెన్షన్ పోయింది...ఆ 9 వేల మంది దొరికారు
X
భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం కలవరపెడుతోంది. సరైన సమయంలో లాక్ డౌన్ విధించడంతో పాటు కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయడంతో చాలావరకు కరోనా కంట్రోల్ లో ఉందని అంతా భావించారు. మరో రెండు వారాల్లో అనుకున్న విధంగానే లాక్ డౌన్ ఎత్తివేస్తారని దేశ ప్రజలంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఢిల్లీలోని మర్కస్ లో జరిగిన సదస్సు కేంద్రంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆ సదస్సుకు పలువురు విదేశీయులు హాజరవడం....ఆ సదస్సుకు హాజరైన వారు తమ తమ రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేసులను ట్రాక్ చేసేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. మర్కస్ సదస్సుతో సంబంధం ఉన్న 9 వేల మందిని గుర్తించామని కేంద్ర హోం శాఖ కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వాస్తవ వెల్లడించారు. వారిలో 1306 మంది విదేశీయులని - మిగతా వారంతా భారత్ లోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారని తెలిపారు. ఢిల్లీలోనే 2వేల మందిని గుర్తించామని - వారిలో 250 మంది విదేశీయులని - మిగతా 1804 మందిని క్వారంటైన్ కు తరలించామని - 334 మందిని ఆసుపత్రుల్లో చేర్పించామని ఆమె తెలిపారు.

వారందరినీ క్వారంటైన్ లో ఉంచి టెస్ట్ చేస్తున్నామన్నారు. సదస్సుకు హాజరైన వారిలో 275 మంది విదేశీయులు మర్కస్ లో కాకుండా నిజాముద్దీన్ ప్రాంతంలోని వివిధ మసీదులలో ఉన్నారని, వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామన్నారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు - ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసుల సాయంతో 9 వేల మందిని అతి తక్కువ సమయంలోనే గుర్తించగలిగామని - అందుకోసం కేంద్ర హోంశాఖ - ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలు తీవ్రంగా శ్రమించాయని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని - నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించాలని అన్నారు. ఈ విపత్కర సమయంలో సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం చాలా ముఖ్యమని - అందుకోసం ఓ ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించాల్సిందిగా కేంద్ర సమాచార ప్రసార శాఖను శ్రీవాత్సవ కోరారు. చాలామంది సోషల్ మీడియాలో - కరోనా కేసుల గురించి - తప్పుడు ప్రచారం చేస్తున్నారని - అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో వారు రూపొందించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ గురువారం నుంచి ప్రారంభమైందని, కరోనాపై వాస్తవాల నిర్ధారణ కోసం pibfactcheck@gmail.com కు ప్రజలు మెయిల్ చేయవచ్చని తెలిపారు.