Begin typing your search above and press return to search.

పోలవరం కేంద్రం బాధ్యతే: జగన్ సంచలనం

By:  Tupaki Desk   |   25 Oct 2020 8:10 AM GMT
పోలవరం కేంద్రం బాధ్యతే: జగన్ సంచలనం
X
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధుల విషయంలో జాప్యం చేస్తుండడంతో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ (పిపిఎ) ఒక జాతీయ ప్రాజెక్టు అని.. ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని కుండబద్దలు కొట్టారు.

ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. అంతకుముందు కేంద్రమంత్రివర్గం కూడా దీనిపై నిర్ణయం తీసుకుందని జగన్ స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించాలని నాడు విభజన చట్టంలో పేర్కొన్నారని.. ఈ ప్రాజెక్టును కేవలం పర్యవేక్షించడం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. ఇప్పటివరకు పోలవరంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4014 కోట్లను తిరిగి చెల్లించాలని జగన్ కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే ఈ ఈ మొత్తంలో రూ .2,234 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు, జల్ శక్తి మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని జగన్ వివరించారు.

భూసేకరణ - పునరావాసం కోసం సుమారు రూ.29,000 కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. దీనిని సిడబ్ల్యుసి.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం చేస్తున్న ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని జగన్ చెప్పారు.

సిడబ్ల్యుసి -కేంద్ర జలశక్తి శాఖ సిఫారసు చేసినట్లు, అమలు చేసిన నాడు ఉన్న రేట్లు, నియమాలు.. నిబంధనలు సడలించి ఇప్పటి రేట్ల ప్రకారం చెల్లింపు కోసం భూసేకరణ.. పునరావాస పనులను పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సవరించిన వ్యయ అంచనాను పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు పూర్తిచేయాలని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు.

సిడబ్ల్యుసి ఆమోదించిన ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని 2017-18 ధరల స్థాయిలో 55,448 కోట్ల రూపాయలకు ఆమోదించింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సవరించిన వ్యయ కమిటీ (ఆర్‌సిసి) ఖర్చును ఆమోదించింది. ఈ ప్రాజెక్టును రూ .47,726 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయబడింది.

అంతకంటే ముందుగా జాతీయ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి ముందస్తుగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించింది.