Begin typing your search above and press return to search.

ఓటీటీ,సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం కఠిన నిబంధనలు

By:  Tupaki Desk   |   26 Feb 2021 3:43 PM GMT
ఓటీటీ,సోషల్ మీడియా సంస్థలపై కేంద్రం కఠిన నిబంధనలు
X
దేశంలో నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా తయారైన సోషల్ మీడియాతోపాటు ఓటీటీ సంస్థలపై కేంద్రం కొరఢా ఝలిపించింది. వాటి నియంత్రణపై కేంద్రం కఠిన నిబంధనలు పొందుపరిచింది.

తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించిన ఖాతాల తొలగింపు అంశంపై ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్-ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం సోషల్, డిజిటల్ మీడియా, ఓటీటీ మాధ్యమాల్లో అభ్యంతరకర, విద్వేష ప్రచారాన్ని అరికట్టేందుకు వీటిని జారీ చేస్తున్నట్టు తెలిపింది.

డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ తో కూడిన సరికొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల వల్ల వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్ స్క్రిప్షన్ ఉపయోగించే మెసేజింగ్ యాప్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు పాటించాలంటే వాటి సెక్యూరిటీ విధానాలను అవే ఉల్లంఘించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలతో సోషల్ మీడియా సాధనాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ కు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ దాని పర్యవసనాలపై దేశవ్యాప్తంగా ఇప్పుడే తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఇక నుంచి ఒక వివాదాస్పద సందేశం ఎవరిద్వారా వచ్చింది అనేది తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది.

ఇక తమ ఫ్లాట్ ఫామ్ పైన ప్రసారమయ్యే కంటెంట్ కు సంబంధించి యూట్యూబ్, అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్తలు అనుసరించాల్సిన నియమాలను నిర్ధారించారు. వివాదాస్పద సమాచారంపై తక్షణమే స్పందించాలని.. ఫిర్యాదుల ద్వారా పరిష్కారం కోసం అధికారులను నియమించాలని.. భారత్ లోని చిరునామాతో ఆఫీస్ ఉండాలని కేంద్రం ఓటీటీలకు సైతం కఠిన నిబంధనలు పొందుపరిచింది.

ఈ పరిణామం సోషల్ మీడియా దిగ్గజాలతోపాటు, ఓటీటీలకు శరాఘాతంగా మారనుంది.