Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై ప్రశ్న అడిగితే కేంద్రం చెప్పిన సమాధానం విన్నారా?

By:  Tupaki Desk   |   16 Jun 2021 4:30 AM GMT
విశాఖ ఉక్కుపై ప్రశ్న అడిగితే కేంద్రం చెప్పిన సమాధానం విన్నారా?
X
విశాఖ ఉక్కు అమ్మకంపై కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానంపై రాష్ట్ర సరిహద్దుల్ని దాటేసిన తెలుగు వారంతా ఒకేలాంటి అభిప్రాయంతో ఉన్నారు. ప్రజల ఆస్తి అయితే విశాఖ ఉక్కును అమ్మేయాలని.. ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే.. ఈ అంశంపై ఫోకస్ ను కరోనా సెకండ్ వేవ్ కాస్త పక్కకు నెట్టేసేలా చేసింది. తీవ్రంగా విరుచుకుపడిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. విశాఖ ఉక్కు అమ్మకం వ్యవహారం కాస్త మరుగున పడింది.

విశాఖ ఉక్కును అమ్మే అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి జగన్ తన అభిప్రాయాన్ని విస్పష్టంగా వెల్లడించటమే కాదు.. అమ్మకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోడీకి లేఖ రాశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. తాజాగా విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ ఆలోచన.. ప్రైవేటీకరణకు సంబంధించి సాగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాల్ని ఇవ్వాలని ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు.

విశాఖ ఉక్కు అమ్మకానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించేందుకు కేంద్ర పెట్టుబడులు.. ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం నో చెప్పింది. ఈ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రోహిత్ చావ్లా బదులిస్తూ.. విశాఖ ఉక్కు అమ్మకంలోని విషయాలన్ని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (ఎ) పరిధిలోకి వస్తాయని.. వాటిని బయటపెట్టలేమన్నారు. ప్రధాని మోడీకి సీఎం జగన్ రాసిన లేఖపై ఇప్పటివరకు ఏం జరిగిందన్న వివరాలు తెలియజేయాలని.. పీఎంవోను అడగ్గా.. దానికి సరైన సమాధానం ఇవ్వాలని దీపమ్ (ప్రజా ఆస్తుల నిర్వాహణ విభాగం) కు చెప్పామని.. వారికి దరఖాస్తు చేయాలని చెప్పారు.

దీంతో ఆర్టీఐ కార్యకర్త దీపమ్ కు దరఖాస్తు చేస్తే..ఈ సమాచారం రహస్యమైనది.. వివరాలు వెల్లడించ లేమని పేర్కొనటం గమనార్హం. ఇక.. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (ఎ) ఏం చెబుతుందన్న విషయాన్ని చూస్తే.. దేశ సార్వభౌమాధికారం.. సమగ్రత.. వ్యూహాత్మక.. వైజ్ఞానిక..ఆర్థిక ప్రయోజనాలు.. విదేశీ సంబందాలపై ప్రతికూల ప్రభావం చూపే సమాచారంగా పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. విశాఖ ఉక్కుపై మోడీ సర్కారు ఆలోచన మారలేదని.. దాన్నిప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయన్న భావన కలిగేలా తాజా సమాధానం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆస్తుల అమ్మకం అంత రహస్యం ఎలా అవుతుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.