Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ కు బలవంతమేమి లేదు.. ఇష్టం ఉంటేనే

By:  Tupaki Desk   |   18 Jan 2022 8:15 AM GMT
వ్యాక్సిన్ కు బలవంతమేమి లేదు.. ఇష్టం ఉంటేనే
X
కరోనా టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని కేంద్రప్రభుత్వం స్పష్ట చేసింది. నచ్చితేనే టీకా తీసుకోవాలని సూచించింది. వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధన ఎక్కడా పెట్టలేదని కేంద్రం తెలియజేసింది. కరోనా పంపిణీపై ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఒత్తిడి తెచ్చే విధంగా లేవని క్లారిటీ ఇచ్చింది. టీకా వేసుకోవాలని కేంద్రం బలవంతం చేస్తుందనే విమర్శల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమక్షంలో కేంద్రం స్పష్టతనిచ్చింది.

కొవిడ్ ను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని వైద్య నిపుణులు చెప్పారు. ఇకపోతే టీకా తీసుకున్నవారిలోనూ ముప్పు తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఇక వందశాతం టీకా పంపిణీ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే టీకా విషయంలో ఒత్తిడి తెస్తున్నారంటూ కొందరు కోర్టునాశ్రయించారు. టీకాపై బలవంతం వద్దంటూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా దీనిపై ప్రభుత్వాన్ని కోర్టు వివరణ కోరింది. టీకా పంపిణీ వివరాలతో కూడిన అఫిడవిట్ ను కేంద్రం సమర్పించింది.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడడానికే టీకా పంపిణీని వేగంవంతం చేశామని పేర్కొంది. అంతేకాకుండా వివిధ మాధ్యమాల ద్వారా వ్యాక్సిన్ పట్ల ప్రజలను చైతన్యం చేస్తున్నామని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై అవగాహన కల్పించామని వివరించింది. టీకా తీసుకుంటే కలిగి లాభాలు, కావాల్సిన అర్హతల గురించి చెబుతున్నామని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎక్కడా కూడా బలవంతంగా టీకా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది.

దివ్యాంగులకు టీకా తప్పనిసరి అనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎవరా అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారికి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని కోరింది. కాగా దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా టీకా ధ్రువపత్రం తప్పనిసరి అనే నిబంధనను ఎక్కడా విధించలేదని స్పష్టం చేసింది. ఎవరికీ బలవంతంగా టీకా వేయలేదని క్లారిటీ ఇచ్చింది.

వ్యాక్సిన్ పై బలవంతమేమి లేదని... ఇష్టం ఉంటేనే తీసుకోవాలని మరోసారి ప్రకటించింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. వాటిలో ఎక్కువగా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.