Begin typing your search above and press return to search.

ఆగస్ట్ 15 న కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   11 Aug 2020 10:30 AM GMT
ఆగస్ట్ 15 న కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం కీలక ప్రకటన !
X
కరోనా వైరస్ ..ప్రపంచం రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క దేశాన్నీ వదల్లేదు. ఇప్పటికే లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. రెండు కోట్లకు పైగా కరోనా వైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. భారత్‌ లో రోజురోజుకూ వైరస్ దూకుడు పెరుగుతోంది.రోజువారీ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 53601 కేసులు నమోదవ్వడంతో... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2268675కి పెరిగింది. అలాగే... 24 గంటల్లో 871 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 45257కి చేరింది.

ఇక, కరోనా వైరస్ ‌ను అంతం చేయడానికి అవసరమైన వ్యాక్సిన్‌ కోసం అనేక దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత్ సహా ఎనిమిది దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యాయి. హైదరాబాద్‌ కు చెందిన భారత్ బయోటెక్ వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ ను రూపొందించాయి. వీటిపై ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అత్యంత కీలకమైన మూడోదశ ట్రయల్స్ ‌ను కొనసాగిస్తున్నాయి ఉత్పాదక సంస్థలు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తామంటూ ఇదివరకే ఐసీఎంఆర్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్‌ పై ఓ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటి తన ప్రసంగంలో ప్రధాన మోడీ దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సంకేతానలు కూడా ఇచ్చిందని చెబుతున్నారు. దీనికి కారణం కరోనా వ్యాక్సిన్ సరఫరా పై ఏర్పాటైన నిపుణుల కమిటీ భేటీనే. ఈ బుధవారం నిపుణుల కీలక భేటీ జరపబోతుంది. కరోనా వ్యాక్సిన్ రవాణా, సరఫరా, రాష్ట్రాలను స్టేక్ హోల్డర్లుగా భాగస్వామ్యాన్ని కల్పించడం వంటి అంశాలను కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల కమిటీ ఈ భేటీ సందర్భంగా చర్చించబోతోంది. కరోనా వ్యాక్సిన్ లాజిస్టిక్స్ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు.