Begin typing your search above and press return to search.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సంచలన ప్రకటన!

By:  Tupaki Desk   |   3 Dec 2021 8:40 AM GMT
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సంచలన ప్రకటన!
X
తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని స్వయంగా సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఢిల్లీలోనూ ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు ఈ నిరసనను కొనసాగిస్తున్నారు.

శుక్రవారం సైతం లోక్ సభ, రాజ్యసభల్లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్ సభలో ఫ్లకార్డులను ముక్కలు ముక్కులుగా చింపి విసిరేసి నిరసన తెలిపారు.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రం ఈ వరి కొనుగోళ్లపై నిలదీశారు. ఐదు రోజులుగా తెలంగాణ రైతుల గురించి తాము ఆందోళన చేస్తున్నామని.. తెలంగాణలో వరిధాన్యం కొంటారా? కొనరా? అనే విషయంపై కేంద్రప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నామా నాగేశ్వరరావు రావు డిమాండ్ చేశారు.

మరోవైపు వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం ప్రకటన చేయాలని రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రబీ సీజన్ లో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని.. బాయిల్డ్ రైస్ కొంటారో లేదో చెప్పాలని కోరారు.

గత ఏడాది 94 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారని.. ఈ ఏడాది ఇప్పటివరకూ 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఎంత కొనుగోలు చేస్తారో చెప్పాలన్నారు.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పుడేమీ చెప్పలేమని.. ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాతే యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై ఆలోచిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు.

బాయిల్డ్ రైజ్ ఇవ్వబోమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని పీయూష్ స్పష్టం చేశారు. ప్రతీ ఏటా వరిధాన్యం కొనుగోళ్లను కేంద్రప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను పెంచుతామని పీయూష్ స్పష్టం చేశారు. వరికొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని పీయూష్ మండిపడ్డారు.