స్పీడుగా స్పందించిన కేంద్రం

Sun Nov 28 2021 12:00:22 GMT+0530 (IST)

Center Responds Quickly On Floods

గతంలో ఎప్పుడూ లేనంత స్పీడుగా భారీ వర్షాలు వరదల అంచనాను అంచనా వేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన పంట జన నష్టాన్ని అంచనా వేసి  కేంద్రం ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయాలని కూడా ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వర్షాల వరదల పరిస్థితి తెలుసుకునేందుకు నేరుగా ఫోన్లో మాట్లాడారు.వర్షాలు వరదలన్నాక ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే తతంగమే. నష్టం అంచనాలకు సీఎంలు కేంద్రానికి లెక్కలు పంపటం మామూలే. కేంద్రం కూడా ఏవో లెక్కలు వేసుకుని ఎంతో కొంత నిధులు విడుదల చేయటమూ మామూలే. ఆ తర్వాత ఎప్పుడో తీరిగ్గా వాస్తవ నష్టాలను అంచనా వేయటానికి కేంద్రం తరపున బృందాలు రాష్ట్రంలో పర్యటిస్తాయి. అప్పటికి జరిగిన నష్టాన్ని రాష్ట్రప్రభుత్వమే ఎంతో కొంత సరిచేసుకుంటుంది.  దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసుకోవటం పంటల్లో మేట వేసిన ఇసుకను తీసేయటం విద్యుత్ స్తంబాలను సరిచేసుకోవటం లాంటివి అత్యవసరాలు కాబట్టి కేంద్రం బృందాలు వచ్చేవరకు వెయిట్ చేయలేదు.

సహాయ కార్యక్రమాలు మొదలైపోయిన తర్వాతెప్పుడో కేంద్ర బృందాలు వచ్చి నష్టాలను అంచా వేస్తాయి. దాంతో జరిగిన నష్టాలకు కేంద్రం బృందాలు వేసే అంచనాలకు చాలా తేడాలుంటాయి. అయితే ఈసారి అలా జరగలేదు. జగన్ విజ్ఞప్తి చేయగానే ఒకవైపు ఇంకా వర్షాలు పడుతుండగానే కేంద్రం నుండి బృందాలు క్షేత్రస్ధాయి పరిశీలనకు వచ్చేశాయి. చిత్తూరు కడప అనంతపురం నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి.

ఆ బృందాలకు ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం 2.86 లక్షల హెక్టార్లలో పంటల నష్టం జరిగింది. అలాగే 44 మంది చనిపోయారు. పంటలు చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులకు తీవ్ర స్ధాయిలో నష్టాలు జరిగినట్లు ప్రభుత్వం కేంద్ర బృందానికి స్పష్టం చేసింది. సరే మరో మూడు రోజులు కేంద్ర బృందాలు క్షేత్రస్ధాయిలో పర్యటనలు జరుపుతాయి. నష్టాలను స్వయంగా అంచనా వేసుకుంటాయి. తర్వాత ఢిల్లీకి తిరిగెళ్ళి తమ నివేదికను అందిస్తాయి. ఇదంతా మామూలే కానీ సాయం అందించే విషయంలో కేంద్రం ఏ మాత్రం స్పందిస్తున్నదే ఇపుడు చర్చనీయాంశమైంది.