Begin typing your search above and press return to search.

దేశంలోని ఆ రాష్ట్రాల్లోనే కేసులు.. మరణాలు అధికం

By:  Tupaki Desk   |   25 May 2020 5:00 AM GMT
దేశంలోని ఆ రాష్ట్రాల్లోనే కేసులు.. మరణాలు అధికం
X
పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు ప్రభావం దేశం మీద ఎక్కువగానే ఉండేట్లు కనిపిస్తోంది. దగ్గర దగ్గర రెండు నెలల పాటు కఠినంగా చేసిన లాక్ డౌన్.. తాజా సడలింపుతో ప్రయోజనం లేకుండా పోయిందన్న ప్రచారానికి తగ్గట్లే.. తాజాగా పాజిటివ్ లు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన వారంలో చూస్తే.. ఏ రోజుకు ఆ రోజు పాజిటివ్ ల సంఖ్య కొత్త రికార్డుల దిశగా పయనించటం ఆందోళన కలిగించే అంశం.

ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో దేశంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 6767 పాజిటివ్ లు కన్ఫర్మ్ అయ్యాయి. అంటే.. సగటున గంటకు 282 కేసులు నమోదవుతున్నాయి. గడిచే ప్రతి నిమిషానికి నాలుగు కేసులకు పైనే నమోదు కావటం చూస్తే.. విస్తరణ వేగంగా సాగుతున్న వైనం బయటకొచ్చింది. గడిచిన మూడురోజులుగా రోజుకు సగటున ఆరు వేలకు పైనే కొత్త కేసులు నమోదు కావటం గమనార్హం. కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమైనా ఉందంటే.. అది మరణాల రేటులోనే. గడిచిన ఎనిమిది రోజుల్లో మరణాల రేటు తక్కువగా ఉందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక.. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 84 శాతం ఎనిమిది రాష్ట్రాల్లోనే కావటం గమనార్హం. మహారాష్ట్ర.. తమిళనాడు.. ఢిల్లీ.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఉత్తరప్రదేశ్.. పశ్చిమబెంగాల్ లోనే ఉన్నాయి. మొత్తం మరణాల్లో 93.22 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉండటం మరో కీలకాంశంగా చెప్పాలి. పాజిటివ్ లకు కొత్త హాట్ స్పాట్ లుగా యూపీ.. బిహార్.. కర్ణాటక.. అసోం.. ఉత్తరాఖండ్ లు మారాయి. సిక్కింలో తొలి కేసు నమోదు కావటం గమనార్హం.

ఆదివారం ఒక్కరోజులో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసులు 64,909 కాగా.. అందులో భారత్ ఖాతాలో 6767 కేసులు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు 54,62,859 కాగా.. ఆదివారం నాటికి దేశంలో మొత్తం కేసులు 1,31,868కు చేరాయి. ఆదివారం వరకూ ప్రపంచ వ్యాప్తంగా నమోదైన మరణాలు 3,45,409 కాగా.. భారత్ లోనే 3,867 మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. ఇప్పటివరకూ ఆ దేశంలో16,75,880 మందికి పాజిటివ్ కాగా.. మరణాల సంఖ్య ఏకంగా లక్షకు కాస్త దూరంలో ఉన్నారు. ఆదివారం నాటికి ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 99,003కు చేరింది.

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల గణాంకాల్ని చూస్తే.. కొత్త టెన్షన్ కలగటం ఖాయం. ఎందుకంటే.. అమెరికా (9,052) తర్వాత అత్యధిక కేసులు నమోదైంది భారత్ (6,767) లోనే. తర్వాతి స్థానం బ్రెజిల్ (5,346).. మూడో స్థానంలో మెక్సికో (3,329).. బ్రిటన్ (2,405) లు నిలిచాయి. లాక్ డౌన్ సడలింపులు మరింత పెంచుకుంటూ పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రానున్న రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.