రోడ్లకు మరమ్మతులు చేయించాడని టీడీపీ నేతపై కేసు?

Fri Sep 30 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Case against TDP leader for repairing roads in AP!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు జనసేన టీడీపీ రోడ్లపై పెద్ద ఉద్యమాలే చేపట్టాయి. ఇక జనసేన పార్టీ అయితే ఈ విషయంలో రెండు అడుగులు ముందుకే వేసింది. భారీగా జెఎస్పీఫర్ఏపీరోడ్స్ హ్యాష్ ట్యాగుతో డిజిటల్ ఉద్యమమే నడిపింది. పార్టీ నేతలతోపాటు స్వయంగా పవన్ కల్యాణ్ కూడా రోడ్ల మరమ్మతుల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ నేతలు అయితే రోడ్ల మీద నీళ్ల గుంటల్లో వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు.అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను బాగు చేయించడం లేదు. టెండర్లు పిలిచామని పనులు మొదలవుతాయనే మాత్రమే చెబుతోంది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ రోడ్లను బాగు చేయించలేదని.. కాబట్టి రోడ్లు పాడయ్యాయి అంటోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై నెపాన్ని రుద్దడాన్ని మరోవైపు నెటిజన్లు తప్పుబడుతున్నారు.

ప్రభుత్వం రోడ్లు బాగు చేయించకపోవడం.. ఆ గుంతలు గతుకుల రోడ్లలో నిత్యం ప్రమాదాలు జరగడం మనుషులు ప్రాణాలు కూడా పోతుండటంతో ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛంధంగా రోడ్లు వేసుకుంటున్నారు. ఇటీవల గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వసూలైన చందాలతోనూ లడ్డూ వేలం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులతోనూ తమ రోడ్లను ప్రజలే బాగు చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఇలాగే రోడ్లు బాగు చేయించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. ఏపీలోని తాడినాడకు చెందిన తాడినాడ బాబు టీడీపీ నాయకుడిగా ఉన్నారు. తమ ఊరి నుంచి చిన్న తాడినాడ వెళ్లే రోడ్డు బాగా పాడై పోయింది. దీంతో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వసూలైన చందాల్లో రూ.2.5 లక్షలను వెచ్చించి తమ ఊరి రోడ్డును బాగు చేయించారు. దీంతో ప్రజలకు రోడ్డు కష్టాలు తీరాయి.

అయితే వైఎస్సార్సీపీ నేతలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్డు బాగు చేసేందుకు తమ అనుమతి తీసుకోలేదని ఓవైపు ఆర్ అండ్ బీ అధికారులు మరోవైపు పోలీసులు టీడీపీ తాడినాడ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఆర్ అండ్ బీ అధికారులు పోలీసులకు సమర్పించారు. దీంతో పోలీసులు అనుమతి లేకుండా రోడ్డు వేశాడని ఆయనపై కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై సాధారణ ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా రోడ్డును బాగు చేయిస్తే అభినందిస్తారని.. ఆ పనిచేయకపోగా పోలీసులతో కేసు పెట్టించడం ఏమిటని నిలదీస్తున్నారు. మరోవైపు ఇలాంటి వింతలు ఏపీలోనే జరుగుతాయంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.