ఎన్టీఆర్ పార్కు దగ్గర బీభత్సం చేసిన ముగ్గురు కుర్రాళ్లు

Sun Nov 28 2021 10:49:41 GMT+0530 (IST)

Car Rams Into Hussian Sagar

ఈ వీడియోను చూశారు కదా? ట్యాంక్ బండ్ మీద సాఫీగా సాగాల్సిన  కారు ప్రయాణం.. అందుకు భిన్నంగా రోడ్డుకు అంత కిందన ఉన్న హుస్సేన్ సాగర్ లోకి పడటం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ పార్కు ముందు చోటు చేసుకున్న ఈ బీభత్సం చూసినంతనే వణుకు పుట్టక మానదు. ఇంత పెద్ద యాక్సిడెంట్ లోనూ హాయిగా నిట్టూర్చే అంశం ఏదైనా ఉందంటే.. అది ముగ్గురు కుర్రాళ్లకు ప్రాణాపాయం దక్కటం. అయినా..రోడ్డు మీద ఎన్ని సర్కస్ ఫీట్లు చేస్తే మాత్రం.. అంతలా కారు అదుపు తప్పి.. హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.నాలుగు రోజుల క్రితమే చేతికి వచ్చిన కారు సామర్థ్యాన్ని టెస్టు చేయాలనుకున్నారో.. లేదంటే కారు మీద తమకున్న సరదాను తీర్చుకోవాలనుకున్నారో కానీ.. ముగ్గురు కుర్రాళ్లు ఆదివారం ఉదయమే రోడ్డు మీదకు వచ్చారు. ఆదివారం తెల్లవారు జామున ట్రాఫిక్ తక్కువగా ఉండటం.. అందునా.. హుస్సేన్ సాగర్ వంతెన మీద వాహన రాకపోకలు తక్కువగా ఉండటంతో.. మితిమీరిన ఉత్సాహంతో కారును దౌడు తీయించారు.

దీంతో అదుపు తప్పిన కారు.. రోడ్డు మీద నుంచి ఏకంగా హుస్సేన్ సాగర్లోకి పడిపోయింది.కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కుర్రాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. లక్కీగా వారికి మేజర్ గాయాలు కాలేదు. కాకుంటే.. తమ సరదా షాకింగ్ ప్రమాదానికి గురి కావటాన్ని జీర్ణించుకోలేని ఆ కుర్రాళ్లు.. సాగర్ లో దూసుకెళ్లిన కారు.. ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జుగా మారిన వైనాన్ని చూసి..తీవ్రమైన షాక్ కు గురైనట్లుగా వీడియోను చూస్తే.. అర్థమవుతుంది.

రోడ్డు మీద వెళ్లే వారు.. ఈ ప్రమాదాన్ని చూసి ఆగటం.. ఒకరు ఆగ్రహంతో తాగి ఉన్నారా? అని అడగటం.. దానికి లేదన్న కుర్రాళ్ల సమాధానం చూస్తే.. ఇంతటి ప్రమాదాన్ని వారే మాత్రం ఊహించలేదన్న విషయం అర్థమవుతుంది.అసలీ కుర్రాళ్లకు కారును నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్సు ఉందా? అన్న సందేహం కలుగకమానదు. ప్రమాదానికి కారణమైన ఈ ముగ్గురు కుర్రాళ్లను నితిన్ సాత్విక్.. కార్తీక్ లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఖైరతాబాద్ కు చెందిన వారుగా చెబుతున్నారు.

ఖైరతాబాద్ నుంచి ఉదయమే బయటకు ఎందుకు వచ్చారన్నది ఆరా తీసినప్పుడు.. అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయటానికి బయలుదేరారని చెబుతున్నారు. మితిమీరిన వేగంతో కారునునడపటం.. అదుపు తప్పిన కారును కంట్రోల్ చేయటంలో ఫెయిల్ కావటంతో.. రోడ్డు మీద వెళ్లాల్సిన కారు.. హుస్సేన్ సాగర్ లో మునిగే పరిస్థితి. దెబ్బలు తగిలిన ఆ కుర్రాళ్లను దగ్గర్లోని యశోదా ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎంత భారీగా జరిగిందన్నది.. ఈ వీడియోను చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.