జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. కారణాలేంటి?

Fri Sep 24 2021 08:00:01 GMT+0530 (IST)

Cantonment merger with GHMC

కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలుసు.. కానీ కేంద్ర ఆధీనంలో ఉండే కాలనీలు గురించి తెలుసా..? అవే కంటోన్మెంట్ ప్రాంతాలు. నగరం నడిబొడ్డున ఉన్నా నగర పాలకసంస్థకు సంబంధం లేకుండా సాగుతున్న ఇలాంటి కంటోన్మెంట్ ప్రాంతాలు దేశంలో 62 ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోనూ ఇది ఉంది. అయితే కంటోన్మెంట్ ప్రాంతాలు అంటే పూర్తిగా కేంద్రం అధీనంలో ఉంటాయి. వాటికి రాష్ట్రాల పాలనతో సంబంధం ఉండదు. ప్రత్యేకంగా చెప్పాలంటే అవి పూర్తిగా కేంద్రానికి చెందిన కాలనీలే. అయితే ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ తో సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతంపై మరోసారి చర్చ సాగుతోంది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని నగర పాలక సంస్థలో విలీనం చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.?కేంద్రం ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధిని కేంద్రమే చూసుకుంటంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే నిధులు కేంద్రం నుంచి మాత్రమే విడుదల కావాలి. కానీ ప్రస్తుతం కేంద్రం ఈ కంటోన్మెంట్ ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. దీంతో తమ ప్రాంతాలన్ని నగరంలో విలీనం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలోని ఉన్న కంటోన్మెంట్ ప్రాంతాన్ని విలీనం చేయాలని 1999లో అడుగులు పడ్డాయి. అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ విలీన ప్రక్రియకు ఆదేశించారు.

అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఆ తరువాత 2018లో మరోసారి ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ రక్షణశాఖ వినియోగిస్తున్న ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన బస్తీలను విలీనం చేసేందుకు నిర్ణయించారు. ఇందుకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ వేసింది. అయితే కమిట రిపోర్డు పెండింగులో ఉంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం 9 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 6 వేల ఎకరాల పూర్తిగా ఆర్మీ అధీనంలో ఉన్నాయి. 500 ఎకరాలు రైల్వే ఎవీయేషన్ చేతిలో ఉన్నాయి. 700 ఎకరాలు బైసన్ పోలో జింఖానా గ్రౌండ్స్ ఉన్నాయి. మిగిలిన 2వేల 800 ఎకరాల్లో 350 బస్తీలు కాలనీలు ఉన్నాయి. బ్రిటిష్ హయాంలో మిలటీరీ అవసరాల కోసం దేశ వ్యాప్తంగా కొన్ని కంటోన్మెంట్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 62 కంటోన్మెంట్ ప్రాంతాలు ఉన్నాయి.

కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు జీహెచ్ఎంసీ పాలనతో సంబంధం ఉండదు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే అభివృద్ధి కంటోన్మెంట్ పాలనలో చేయరు. అయితే ప్రస్తుతం కంటోన్మెంట్ పరధిలో ఉన్న కొన్ని కాలనీలు బస్తీలు అభివృద్ధి జరగడం లేదు. చాలా రోజులుగా ఇక్కడి ప్రాంతాలకు నిధులు రావడం లేదు. దీంతో తమ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని కూడా జీహెచ్ఎంసీ తరహాలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ కు మద్దతు పెరుగుతోంది. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అయితే పన్నులు వసూళ్లు అయినా పర్మిషన్ అయినా జీహెచ్ఎంసీ ద్వారానే జరుగుతాయి. నగర నడిబొడ్డున ఉన్నా తమ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీ పరధిలోకి వస్తే ఇబ్బందులు ఉండవి ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

అయితే గతంలో కంటోన్మెంట్ విలీన ప్రతిపాదనను వ్యతిరేకించిన బోర్డు ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ఆర్మీ అవసరాల కోసం కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా మిగతా కాలనీలు మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలంటున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. తమ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని కోరుకుంటున్న వారి కల నెర వేరుతుందా..? లేదా..? చూడాలి.