Begin typing your search above and press return to search.

ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా

By:  Tupaki Desk   |   28 Nov 2021 10:05 AM GMT
ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా
X
అమెజాన్ ఆన్ లైన్ డెలివరీ యాప్ ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. డయాబెటీస్ వ్యాధి నివారణకు తయారయ్యే ఆయుర్వేద మెడిసిన్ లో వాడే ‘సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్' పేరిట రవాణా చేస్తున్న ఐదుగురు ముఠాను అరెస్ట్ చేసినట్లు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో జేడీ సతీష్ కుమార్ వెల్లడించారు.

గత ఏడెనిమిది నెలల నుంచి అమెజాన్ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగించుకొని సుమారుగా 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురు వ్యక్తులను ఎస్.ఈబీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అమెజాన్ ఆన్ లైన్ యాప్ ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని మధ్యప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 21న కంచరపాలెంకు చెందిన చిలకపాటి శ్రీనివాసరావు ఇంటిలో తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఇంటిలో 48 కేజీల డ్రైగంజాయితోపాటు ఓ ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్, గంజాయి ప్యాకెట్లను ఉపయోగించే రెండు కార్డ్ బోర్డు బాక్స్ లు, అమెజాన్ బ్లాక్ అండ్ గ్రే కలర్ పాలిథీన్ బ్యాగ్స్, అమెజాన్ టేప్స్ దొరికాయని తెలిపారు.

శ్రీనివాసరావును విశాఖలో అరెస్ట్ చేసి విచారించగా మధ్యప్రదేశ్ మూలాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ కు చెందిన సురజ్ పావయ్య, ముకుల్ జైశ్వాల్ ఇద్దరూ 'సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్' పేరిట అమెజాన్ యాప్ లో బుక్ చేసినట్లు చెప్పాడని తెలిపారు.

ఈ కేసులో కీలక సూత్రధారులు అయిన చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్ రాజు, అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్ వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.