Begin typing your search above and press return to search.

ఏకగ్రీవాలను ఎన్నికల కమీషన్ రద్దు చేయచ్చా?

By:  Tupaki Desk   |   26 Oct 2020 8:10 AM GMT
ఏకగ్రీవాలను ఎన్నికల కమీషన్ రద్దు చేయచ్చా?
X
ఈనెల 28వ తేదీన స్టేట్ ఎలక్షన్ కమీషన్ ఆధ్వర్యంలో జరగబోతున్న రాజకీయ పార్టీల సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మార్చిలో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించే విషయమై పార్టీలతో ఎలక్షన్ కమీషనర్ మీటింగ్ పెట్టినా అసలు అజెండా మాత్రం వేరే ఉందనే ప్రచారం పెరిగిపోతోంది. అదేమిటంటే అప్పుడు జరిగిన జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల్లో కొన్ని ఏకగ్రీవరమయ్యాయి. 660 జడ్పీటీసీ స్ధానాల్లో 126 స్థానాలు, 10047 ఎంపిటీసీ స్ధానాల్లో 2663 ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమారే అప్పట్లో ప్రకటించారు.

అయితే ఆ తర్వాత ఎన్నికలు వాయిదా వేశారు. అప్పటి నుండి ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇదే నేపధ్యంలో ఎన్నికలు జరిగిన తీరు, ఏకగ్రీవాలైన స్ధానాలపైన కూడా నిమ్మగడ్డ కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా రేపటి సమావేశంలో ప్రకటించిన ఏకగ్రవాలను రద్దు చేయాలని మెజారిటి పార్టీలు డిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. మరి మెజారిటి పార్టీల నిర్ణయం అని నిమ్మగడ్డ కూడా సానుకూలంగా స్పందిస్తే ఏమవుతుంది ?

ఒకసారి ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన స్ధానాల్లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ ను సహజంగానే అధికారపార్టీ తిరస్కరిస్తుంది. అయితే అధికారపార్టీ అభిప్రాయాన్ని ఎలక్షన్ కమీషన్ పాటించాలని ఏమీ లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమీషనరే ప్రకటించినా మళ్ళీ వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమీషన్ కు ఉందని అంటున్నారు. ఎన్నికల నిర్వహణ తర్వాత ఫలితాల వివరాలను, గెలిచిన సభ్యుల జాబితాను అధికారికంగా ఎలక్షన్ కమీషన్ ప్రభుత్వానికి సమర్పించాలట.

ఈలోగా ఎక్కడైనా అక్రమాలు జరిగి అభ్యర్ధి గెలిచినట్లు ఆరోపణలు వస్తే, ఆ ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన బాధ్యత కమీషన్ పైనే ఉంటుంది. ఒకవేళ కమీషన్ గనుక అక్రమాల ద్వారా అభ్యర్ధి గెలిచాడని కన్వీన్స్ అయితే అప్పుడు ఆ ఎన్నికను రద్దు చేసే అధికారం ఎలక్షన్ కమీషన్ కు ఉందట. ఒకసారి గెలిచిన అభ్యర్ధుల జాబితాను ప్రభుత్వానికి ఎలక్షన్ కమీషన్ అందచేసిన తర్వాత ఆరోపణలు వచ్చినా అభ్యర్ధుల గెలుపును కమీషన్ రద్దు చేయలేదని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే జడ్పీటీసీ, ఎంపిటీసీ స్ధానాలను నిమ్మగడ్డ రద్దు చేసే అవకాశాలున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ మెజారిటి పార్టీల డిమాండ్ ప్రకారమే గెలిచిన ఫలితాలను రద్దు చేయాలంటే ముందు విచారణ జరపాలి. విచారణలో అక్రమాలు, ధౌర్జన్యాలు జరిగినట్లు నిర్ధారణ కావాలి. అప్పుడు ప్రకటించిన ఏకగ్రీవ ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగలదు. ఎలక్షన్ కమీషన్ గనుక అలా ప్రకటిస్తే వెంటనే అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంటే అప్పుడు అధికారపార్టీకి, నిమ్మగడ్డకు మధ్య గొడవలు మొదలవుతాయనటంలో సందేహమే లేదు. ఇపుడు ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మాత్రమే ఉన్న గొడవలు అప్పుడు అధికారపార్టీతో కూడా మొదలవుతాయి. మరి ఆ పరిస్ధితే వస్తే నిమ్మగడ్డ చర్యలను కోర్టు ఏ విధంగా చూస్తుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి 28వ తేదీ సమావేశం రాజకీయాలను మరోసారి వేడెక్కించేట్లుగానే ఉంది.