Begin typing your search above and press return to search.

చ‌లో చ‌లో గోవా.. క‌రో క‌రో జ‌ల్సా.. క్యాంపులో కోర్కెల చిట్టాలు..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 11:30 PM GMT
చ‌లో చ‌లో గోవా.. క‌రో క‌రో జ‌ల్సా.. క్యాంపులో కోర్కెల చిట్టాలు..!
X
చ‌లో చ‌లో గోవా.. క‌రో క‌రో జ‌ల్సా.. అని పాట పాడుకుంటున్నారు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు. డిసెంబ‌రు 10న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీఆర్ఎస్ స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను గోవాకు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. అక్క‌డికి వెళ్లిన వారంద‌రూ త‌మ కోర్కెల చిట్టాల‌ను భ‌య‌ట‌పెడుతున్నారట‌. వారి డిమాండ్లు చూసి ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నార‌ట‌. ఈ ప‌దిరోజులు వారిని ఎలా మేనేజ్ చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు ఉన్న టీఆర్ఎస్‌ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రినీ ఇటీవ‌ల విహార‌యాత్ర‌లకు త‌ర‌లించారు. టీఆర్ఎస్ త‌ర‌పున ఆదిలాబాద్ నుంచి దండె విఠ‌ల్‌, న‌ల్ల‌గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఖ‌మ్మం నుంచి తాతా మ‌ధుసూద‌న్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి ఎల్‌.ర‌మ‌ణ‌, టి.భానుప్ర‌సాద‌రావు, మెద‌క్ నుంచి డాక్టర్ యాద‌వ‌రెడ్డి బ‌రిలో నిలిచారు. వీరంద‌రికీ మ‌ద్ద‌తుగా త‌మ ఓటు బ్యాంకు చేజార‌కుండా స్థానిక ప్ర‌తినిధుల‌ను క్యాంపుల‌కు త‌ర‌లించారు. ఎక్కువ మందిని గోవాకు.. మ‌రికొంత మందిని ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించారు. పోలింగ్ తేది 10న ఉద‌య‌మే వారంద‌రూ తిరిగొచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఓటు హ‌క్కు ఉన్న టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ వ్య‌క్తిగంతంగానే కాకుండా త‌మ కుటుంబ స‌భ్యుల‌ను కూడా వెంట‌తీసుకెళ్లేందుకు ఒప్పించుకున్నారు. దీంతో ఇన్‌చార్జి నేత‌ల‌కు ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌యింది. అదీ కాకుండా అక్క‌డికి వెళ్లిన వారంద‌రు త‌మ‌కు ఖ‌రీదైన హోట‌ళ్ల‌లో రూములు కావాల‌ని.. క్యాసినోలు, ఇత‌ర ఈవెంట్ల‌లో పాల్గొనే ఖ‌ర్చులు కూడా భ‌రించాల‌ని ష‌ర‌తులు విధించారు. తాము ఎన్నికైన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేద‌ని.. క‌నీసం ఇలాంటి వాటినైనా ఏర్పాట్లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

కొంద‌రు మ‌హిళా ప్ర‌తినిధులు అయితే త‌మ‌ను గోవా మొత్తం తిప్పి చూపించ‌మంటున్నార‌ట‌. పురుష ప్ర‌తినిధులు ఖ‌రీదైన మ‌ద్యం, విందు ఏర్పాటు చేయాల‌ని అడుగుతున్నార‌ట‌. మ‌రికొంద‌రైతే షాపింగ్‌ల్లో ఖ‌రీదైన వ‌స్తువుల‌ను కొనివ్వాల‌ని బెదిరిస్తున్నార‌ట‌. దీంతో క్యాంపుల ఇన్‌చార్జులు బెంబేలెత్తుతున్నార‌ట‌. ఈ డిమాండ్లు స‌రిపోవ‌న్న‌ట్లు కొత్త కొత్త కోరిక‌ల చిట్టాను బ‌య‌ట‌పెడుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఒక్కొక్క స‌భ్యుడికి సుమారు 3 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని బాధ్యులు లెక్క‌లు వేసుకున్నార‌ట‌.

ఇవీ గాక త‌మ‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని ష‌ర‌తులు విధిస్తున్నార‌ట‌. విహార యాత్ర‌ల ఖ‌ర్చులు కాకుండానే ఒక్కొక్క స‌భ్యుడికి క‌నీసం రూ.5 ల‌క్ష‌ల ప్యాకేజీ ఇవ్వాల‌ని.. లేకుంటే పోలింగ్ రోజు త‌మ ప్ర‌తాపం చూపిస్తామ‌ని బెదిరిస్తున్నార‌ట‌. దీంతో క్యాంపుల ఇన్‌చార్జులు మింగ‌లేక క‌క్క‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌.