ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి.. బ్రెజిల్ పై ఓ ఆఫ్రికా జట్టు విజయం

Sat Dec 03 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Cameroon first African team to taste victory against Brazil at a World Cup

ఇప్పటివరకు 21 ఫుట్ బాల్ ప్రపంచ కప్ లు జరిగాయి. ప్రస్తుతం 22వ ప్రపంచ కప్ నడుస్తోంది. బ్రెజిల్ ఐదు సార్లు కప్ గెలిచింది. ఇటలీ జర్మనీ నాలుగు సార్లు నెగ్గాయి. ఉరుగ్వే ఫ్రాన్స్ రెండుసార్లు కప్ వశం చేసుకున్నాయి. స్పెయిన్ బ్రిటన్ వంటి జట్లు కూడా కప్ ను గెలిచాయి. విజేతగా నిలవడం ఎవరికైనా ఏ దేశానికైనా గొప్పే. ఈ కోవలోనే ఇప్పుడు ఓ దేశం సంబరాల్లో మునిగిపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచ కప్ చరిత్రలో ఏ ఆఫ్రికా దేశమూ సాధించలేని ఘనతను సాధించింది కాబట్టి.ఫుట్ బాల్ పెద్దన్నను ఢీకొట్టి

ప్రపంచంలో ఫుట్ బాల్ అంటే దక్షిణ అమెరికా యూరప్ ఖండాలే. పేరుకే పెద్ద ఖండాలు కానీ.. ఆసియా ఆఫ్రికా నుంచి విజేతగా నిలిచే సత్తా ఉన్న జట్లు లేవు. ఆసియాలో ఇప్పుడిప్పుడే జపాన్ దక్షిణ కొరియా ఇరాన్ ఆఫ్రికాలో మరికొన్ని దేశాల జట్లు బలమైనవిగా ఎదుగుతున్నాయి. కానీ ఇవి కప్ సాధించాలంటే మాత్రం చాలా కాలం పట్టేలా కనిపిస్తున్నది. కాగా ప్రపంచ ఫుట్ బాల్ లో పెద్దన్న బ్రెజిల్. ఐదుసార్లు కప్ గెలవడమే కాదు.. పలుసార్లు ఫైనల్ కు చేరింది ఆ జట్టు. అలాంటి జట్టును ఇప్పటివరకు ఒక్క ఆఫ్రికా జట్టు కూడా ఓడించలేదు. తొలిసారి ఆ ఘనతను అందుకుని కామెరూన్ చరిత్రకెక్కింది.

గ్రూప్ లో చివరన ఉంటేంనే..

బ్రెజిల్ స్విట్జర్లాండ్ కామెరూన్ సెర్బియా.. ఇది ప్రపంచ కప్ గ్రూప్- జి. ఇందులో బ్రెజిల్ స్విట్జర్లాండ్ బలమైన జట్లు. కామెరూన్ సెర్బియా సత్తా ఒకటీ అరా సంచలనాలకే పరిమితం. కాగా శుక్రవారం అర్థరాత్రి మ్యాచ్ లో బ్రెజిల్ ను 1-0తో ఓడించింది కామెరూన్. ఇన్నేళ్ల ప్రపంచ కప్ చరిత్రలో బ్రెజిల్ ను ఓడించిన తొలి ఆఫ్రికా జట్టు కామెరూనే కావడం విశేషం. వాస్తవానికి బ్రెజిల్.. స్విట్జర్లాండ్ ను 1-0తో సెర్బియాను 2-0తో ఓడించి నాకౌట్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే.. కామెరూన్.. సెర్బియాతో మ్యాచ్ ను 3-3తో డ్రా చేసుకోవడంతో ముందుకెళ్లలేకపోయింది. స్విట్జర్లాండ్ తో మ్యాచ్ ను ఆ జట్టు 0-1తో కోల్పోవడం కూడా దెబ్బతీసింది. లేదంటేనా..? కామెరూన్ రౌండ్ 16కు వెళ్లేది.

గోల్ కొట్టి.. చొక్కా విప్పి.. గ్రౌండ్ నుంచి ఔట్

కామెరూన్-బ్రెజిల్ మ్యాచ్ లో మ్యాచ్ అధికారిక సమయం 90 నిమిషాల్లో గోల్ నమోదు కాలేదు. దీంతో గోల్సేమీ లేకుండా డ్రాగా ముగుస్తుందని భావించారు. కానీ 92వ నిమిషయంలో విన్సెంట్ అబూ బాకర్ గోల్ కొట్టాడు. ఆ వెంటనే అతడు చొక్కా విప్పి సంబరం చేసుకున్నాడు. కాగా ఈ ప్రవర్తనకు గాను అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అప్పటికే రెండుసార్లు ఎల్లో కార్డుకు గురవడంతో అబూ బాకర్ కు ఈ శిక్ష తప్పలేదు. ఏమైతేనేం..? ఏదైతేనేం..?  బ్రెజిల్ ను ఓడించిన తొలి ఆఫ్రికా జట్టుగా మాత్రం నిలిచింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.