బాబు అద్దె ఇంటిని కూల్చేయటం షురూ చేసిన సీఆర్డీఏ

Mon Sep 23 2019 11:23:27 GMT+0530 (IST)

CRDA Officials to Demoilish Ex CM Chandrababu Naidu House in undavalli

గడిచిన కొద్దికాలంగా వివాదాస్పద అంశంగా మారి.. తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దెకు నివాసం ఉండే ఇంటిని సీఆర్డీఏ అధికారులు కూల్చేస్తున్నారు. కరకట్ట మీద నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బాబు అద్దెకుండే నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నారు.అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఉక్కుపాదం మోపాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అందుకు తగ్గట్లే బాబు నివాసంపై అనూహ్య రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. బాబు నివాసంతో పాటు.. మరో రెండు ఇళ్లను కూల్చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే రెండు..మూడుసార్లు సీఆర్డీఏ అధికారులు చంద్రబాబు అద్దెకు ఉండే నివాసానికి నోటీసులు ఇచ్చారు. ఈ ఇంటి యజమాని లింగమనేని రమేశ్ అధికారుల ఎదుట హాజరై.. తన వాదనలు వినిపించారు. ఇదే రీతిలో అక్రమ కట్టడాలుగా భావించి నోటీసులు ఇచ్చిన 20 మంది వాదనలు విన్నారు. తుదకు ఐదు కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి.. నోటీసులు జారీ చేశారు.

వారం రోజుల్లో ఆ కట్టడాల్ని కూల్చి వేయాలని.. లేకుంటే సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అధికారులు చెప్పిన రీతిలో ఇంటి యజమానులే తమ నిర్మాణాల్ని తామే కూల్చుకోవటం కానీ.. లేదంటే అధికారులు కానీ కూల్చి వేస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అద్దెకు ఉండే నివాసంతో పాటు.. శివస్వామి ఆశ్రమంలో ఉన్న రెండు కట్టడాలు.. ఆక్వా డెవిల్స్ పేరుతో ఉన్న మరో కట్టడంతో పాటు ఇంకో మూడు అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు కూల్చేయటానికి రంగం సిద్ధం చేశారు.