సీఎం జగన్ ఇంటి ముట్టడికి ఉద్యోగులు సిద్ధం!

Tue Aug 16 2022 11:39:09 GMT+0530 (IST)

CPS employees in AP

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై వైఎస్ జగన్ ప్రభుత్వ మోసపూరిత విధానాన్ని నిరసిస్తూ  సీపీఎస్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 1న సీపీఎస్ విధానం అమల్లోకి రావడంతో ఆ రోజును బ్లాక్ డే పాటిస్తూ వస్తున్నారు. సీపీఎస్‌ను ఎత్తేసి పాత పెన్షన్ స్కీమును ప్రవేశపెట్టాలని ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు నిరసనలు ర్యాలీలు నిర్వహించారు. అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెప్టెంబర్ 1న ఏకంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటిని ముట్టడించడానికి సీపీఎస్ ఉద్యోగులు నిర్ణయించారు.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత హోదాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తన పాదయాత్రలో దాదాపు ప్రతిచోటా ఆయన తనను కలసిన ఉద్యోగులకు హామీ ఇచ్చారు.తాము అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ ను రద్దు చేస్తామని భరోసా ఇచ్చారు.

అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత సీపీఎస్ ను రద్దు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. అందులో ఒక సాంకేతిక అంశం ఉందని.. ఆ విషయం తెలియక సీఎం జగన్ మాట ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

దీంతో సీపీఎస్ ఉద్యోగులు ఆందోళనలు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు కూడా అందించారు. దీంతో జగన్ ప్రభుత్వం సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశారు. ఇక చివరకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తే భవిష్యత్తులో ఆర్థిక భారంగా మారుతుందని.. అందుకే జీపీఎస్ తీసుకొస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. ఉద్యోగులకు సీపీఎస్ తోనే మంచి జరగతుందని భారీ ఎత్తున మీడియాకు ప్రకటనలు కూడా ఇచ్చారు.

దీంతో సీపీఎస్ ఉద్యోగులు సీఎం జగన్ ఇంటిని సెప్టెంబర్ 1న ముట్టడించాలని నిర్ణయించారు. తద్వారా తమ నిరసనను సీఎం జగన్ కు తెలియజేయాలని నిశ్చయించారు. సీపీఎస్ రద్దు చేసి ఎన్నికల ముందు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులతోపాటు 93 వేల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొంటారని ఉద్యోగ సంఘాలు నేతలు చెబుతున్నారు.

ఉద్యోగ సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందో ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. జీతాల పెంపు పీఆర్సీపై గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. ప్రభుత్వ ఆంక్షలు హెచ్చరికలను బేఖాతరు చేసి మరీ భారీగా విజయవాడ తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న ఏకంగా సీఎం ఇంటి ముట్టడికి పిలుపు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.