పవన్ గాలి తీసిన సీపీఐ నారాయణ

Tue Sep 21 2021 23:00:01 GMT+0530 (IST)

CPI Narayana Comments On Pawankalyan

ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. ఆయన పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తాడని.. సగం రాజకీయాలు..సగం సినిమాలకే కేటాయిస్తాడనే విమర్శ ఉంది. ఓ ఐదేళ్ల పాటు ప్రజల్లోనే ఉండి వారి సాదక బాధకాలు తెలుసుకునే తీరిక ఓపిక ఆయనకు లేవని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక పార్టీ నడిపేందుకు ఖర్చుల కోసం అంటూ మళ్లీ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు పవన్. ఇప్పుడు పార్టీని మొత్తం నంబర్ 2 నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టేసి పవన్ సినిమా రంగంలో బిజీ అయిపోయారు. తాజాగా అప్పుడప్పుడూ ఏపీకి వస్తూ అగ్గి రాజేస్తున్నారు.

తాజాగా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ పోరాటం మొదలుపెట్టారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరుఫున పోరాడడానికి పవన్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంపై నమ్మకం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అందుకు గల కారణాలను నారాయణ వెల్లడించడం విశేషం.

''222 రోజులుగా మహా ఉద్యమం జరుగుతుంటే మీకు ఇప్పటివరకు కనిపించలేదా? ఢిల్లీలో ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ మీరు రాలేదు.. మీకు ఢిల్లీలో పలుకుబడి ఉంది గట్టిగా చెప్పండి.. ఎందుకు చెప్పలేకపోతున్నారు'' అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. అక్కడకు వెళ్లి కాళ్లు పట్టుకొని ఇక్కడ మీసం తిప్పుతావా? ఇక్కడేమో బీజేపీతో గుద్దులాట.. అక్కడేమో ముద్దులాటనా? అని నారాయణ విమర్శించారు.

ప్రజలను నమ్మకద్రోహం చేయవద్దని.. చేతకాకపోతే చేతకాదని చెప్పండని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం సాధ్యమేనని సీపీఐ నారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయినా ఆగాలి.. లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ నాశనం అయినా అవ్వాలని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అండర్ గ్రౌండ్లో ఉండగలిగితే ఉండండి.. రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలంటే ఖచ్చితంగా పోరాడాల్సిందేనని అసలు నిజాన్ని నారాయణ సూటిగా పవన్ కు సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే శక్తి కేవలం ఉపరాష్ట్రపతి వెంకయ్యకు మాత్రమే ఉన్నాయని.. కాపాడాలని నారాయణ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే పవన్ చేస్తున్న బయట ఉద్యమాలు.. అస్సలు ఉపయోగం లేని పోరాటాలను నారాయణ ఎద్దేవా చేశారు. పవన్ గాలి తీసేసేలా మాట్లాడారు.