Begin typing your search above and press return to search.

ఢిల్లీ కాలింగ్‌..సజ్జ‌నార్ హ‌స్తిన టూర్‌!

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:20 PM GMT
ఢిల్లీ కాలింగ్‌..సజ్జ‌నార్ హ‌స్తిన టూర్‌!
X
దిశ ఘటనలో నలుగురు నిందితుల ఎన్‌ కౌంటర్‌ పై ఉత్కంఠ కొన‌సాగుతోంది. నిందితులు ఈ నెల 6న చటాన్‌ పల్లి వద్ద పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే, తాము మృతదేహాలను పరిశీలించే వరకు అంత్యక్రియలు చేయవద్దంటూ తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌ హెచ్‌ ఆర్సీ).. అనంతరం ఈ ఎన్‌ కౌంటర్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా ఎన్‌ కౌంటర్‌ లో పాల్గొన్న పోలీసు బృందాన్ని రెండు రోజులుగా విచారిస్తోంది. ఇదే స‌మయంలో...దిశ నిందితులను ఎన్‌ కౌంటర్‌ చేసిన పోలీసులపై సిట్ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్లను బుధవారం విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌కు స్వ‌యంగా సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ హాజ‌ర‌వుతున్నారు.

దిశ నిందితులను ఎన్‌ కౌంటర్‌ చేసిన పోలీసులపై సిట్ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని న్యాయవాదులు జీఎస్ మణి - ఎంఎల్ శర్మ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ కేసులను ప్రస్తావించారు. కాగా, బుధవారం విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టులో దిశ ఎన్‌ కౌంటర్ కేసు విచారణకు రానున్న నేప‌థ్యంలో సీపీ సజ్జనార్ కేసు విచారణకు స్వయంగా హాజరుకానున్నారు. ఈ సంద‌ర్భంగా కేసు పూర్వాప‌రాలు - ఎన్‌ కౌంట‌ర్‌ వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నున్నారు.

మ‌రోవైపు, దిశ నిందితుల ఎన్‌ కౌంటర్ కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదావేసింది. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశంపై పిల్స్ దాఖలయ్యాయని - వాటిపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు విచారణను గురువారానికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకున్నది. శుక్రవారం వరకు మృతదేహాలను సంరక్షించాలని చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ - జస్టిస్ అభిషేక్‌ రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు మృతదేహాలను సోమవారం రాత్రి గాంధీ దవాఖానకు తరలించి.. భద్రపరిచారు.