స్పీకర్ ఆదేశాలకు సై అన్న సీఎం జగన్ !

Mon Jan 20 2020 14:28:33 GMT+0530 (IST)

CM who has made a key decision on Insider trading with Speakers mandate!

ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీకి మూడు రాజధానుల వ్యవహారం సిఆర్డిఏ రద్దు పై ఈ ప్రత్యేక సమావేశాలలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే వీటికి సంబందించిన బిల్లుల్ని మంత్రులు సభ ముందుకి తీసుకువచ్చారు. ఇకపోతే ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా మరో సమస్యకి సమాధానం దొరికింది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్చ జరుగుతూనే ఉంది.అమరావతిని రాజధాని గా ఎంపిక చేసే ముందు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో సుమారు వేలాది ఎకరాలను ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల ముందు నుంచి ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో వైసీపీ టీడీపీ నేతల మధ్య తరచు ఆరోపణలపర్వం నడుస్తూనే వుంది. తాజాగా డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నేతలు సుమారు 4 వేల ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ విధానంలో కొన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో వెల్లడించారు.

తాజాగా జనవరి 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తొలి రోజున ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పై సవాళ్ళ పర్వం జోరుగా సాగుతున్నందున నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని స్పీకర్ హోదాలో తమ్మినేని సీతారామ్ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ...స్పీకర్ నుంచి వచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూస్తామని ప్రకటించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్  పై విచారణ జరిపిస్తామన్నారు. దీనితో గత ఆరు నెలలుగా ఏపీవ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్న అంశంపై విచారణ ఖాయమని సోమవారం శాసనసభ వేదికగా తేలిపోయింది. అయితే దీని పై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఒక్క సారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.