Begin typing your search above and press return to search.

సీఎం సహాయనిధిని కొల్లగొట్టారు?

By:  Tupaki Desk   |   23 Sep 2021 8:31 AM GMT
సీఎం సహాయనిధిని కొల్లగొట్టారు?
X
పేదలను ఆదుకునేందుకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయి. అవసరమున్న వారికి సహాయం చేయాలన్నా అది అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ నగదును అక్రమార్కులు కొల్లగొట్టేస్తున్నారు. పైకి తాము పేదలకు న్యాయం చేస్తున్నామని చెబుతున్నా.. లోలోపల జరిగే తతంగాన్ని ఉన్నతాధికారులు గుర్తించ లేకపోయారు. ఫలితంగా కొందరు అందినకాడికి దోచుకున్నారన్న విమర్శలున్నాయి. అయితే కొందరు ఉన్నతాధికారులు సైతం వీరికి వత్తాసు పలకడంతో ఈ విషయాలు వెలుగులోకి రాలేదని ప్రచారం సాగుతోంది. కొన్నేళ్ల తరువాత ఈ పథకం నిధుల్లో తేడాలు రావడంతో అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో తీగ లాగడంతో డొంకంతా కదిలింది. అసలు విషయం బయటపడింది.

సీఎంఆర్ఎఫ్.. ఆపదలో ఉన్న వారికి ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకం. నిరుపేదలకు అత్యవసర సమయంలో వారి అవసరాన్ని గుర్తించి నగదు రూపంలో ఈ పథకం ద్వారా సాయం అందిస్తారు. అయితే ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే సంబంధిత క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే అదనుగా భావించిన కొందరు నకిలీ క్లెయిమ్ లు సృష్టించి తాము పేదవారుగా నటించి డబ్బులు కొల్లగొట్టారు. మొత్తంగా 88 నకిలీ క్లెయిమ్ లను చేసి 35 క్లెయిమ్ లనుంచి రూ.61.68 లక్షలు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో సీఎంఆర్ఎఫ్ విభాగంలో పనిచేసిన ఓ ప్రత్యేక అధికారి ఫిర్యాదులో ఈ విషయాలు బయటికి వచ్చాయి.

2014 నుంచి ఏపీలో సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఓ ప్రత్యేక ముఠా ఏర్పడింది. పేదవారికి నగదు అవసరమున్నట్లు గుర్తించి నిధులను దారి మళ్లించడమే ఈ ముఠా చేసే పని. రాజు అనే వ్యక్తికి బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పి ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం సహా ధ్రువ పత్రాలన్నింటిని లక్ష్మణ్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. ఆయన సంతకాలతో విత్ డ్రా ఫాంలను కూడా తీసుకెళ్లాడు. అయితే రాజు ఖాతాలో అప్పటికే సీఎంఆర్ఎఫ్ డబ్బులు రూ.3 లక్షలు వచ్చాయి. అప్పటికే విత్ డ్రా ఫాంలో దగ్గర ఉన్న లక్ష్మణ్ వెంటనే వాటిని విత్ డ్రా చేసుకున్నాడు. అయితే ఆ తరువాత తన ఫోన్లోకి మెసేజ్ రావడంతో అప్రమత్తమైన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సీఎంఆర్ఎఫ్ అధికారుల వద్దకూ చేరింది. కానీ అప్పుడు దానిని కప్పి పెట్టేసినట్లు ఇప్పటి అధికారులు పేర్కొంటున్నారు.

సీఎంఆర్ఎఫ్ లో అవినీతి జరగుతుందని 2020లో కొందరు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని సీఎంఆర్ఎఫ్ ప్రత్యేక అధికారి డాక్టర్ హరికృష్ట సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం జగన్ ఈ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టకుండా విచారణ చేయాలన్నారు. దీంతో సీఎంఆర్ పీఎఫ్ అధికారులు 2014 నుంచి డాటాను సేకరిస్తున్నారు. అప్పటి నుంచి జరిగిన చెల్లింపులు, జరిగిన అవినీతి భాగోతాన్ని బయటపెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే 2014 నుంచి ఈ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అరెస్టు చేశారు. అయితే 2014 నుంచి 2019 వరకు సీఎం ఆర్ పీఎఫ్ చెల్లింపులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకుడా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ డేటా ఆధారంగా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు.

ఇప్పటి వరకు అధికారులు 88 క్లెయిమ్ లు అక్రమంగా ఫైళ్లు చేసినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి 1 కోటి 81 లక్షల 7800 మొత్తాన్ని బిల్లులు మంజూరు చేసినట్లు తేల్చారు. దీంతో మిగిలిన రూ.1.20 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. ప్రత్యేక అధికారి హరికృష్ణ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం నలుగురిని అరెస్టు చేయగా మరింత మంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.