Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేక ఆహ్వానంః సీఎంను ఆహ్వానించిన సీఎం ర‌మేశ్!

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:30 PM GMT
ప్ర‌త్యేక ఆహ్వానంః సీఎంను ఆహ్వానించిన సీఎం ర‌మేశ్!
X
ఒకే జిల్లాకు చెందిన వారే అయినా.. ఇన్నేళ్లూ వైఎస్ ఫ్యామిలీ అంటే విమ‌ర్శ‌ల‌కే ఎక్కువ ఉత్సాహం చూపుతూ వ‌చ్చారు సీఎం ర‌మేశ్. ఈయ‌న ప్ర‌జ‌ల నుంచి గెలిచింది ఎప్పుడూ లేక‌పోయినా, ప్ర‌జా బ‌లం ఏమీ లేక‌పోయినా.. చంద్ర‌బాబు నాయుడుకు అతి స‌న్నిహితుడుగా మెలుగుతూ... వైఎస్ జ‌గ‌న్ మీద తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసే వారు సీఎం ర‌మేశ్. అయితే కొన్నాళ్ల కింద‌ట క‌థ మారింది. చంద్ర‌బాబుకు కుడి భుజంగా వ్య‌వ‌హరించిన సీఎం ర‌మేశ్ త‌న భుజాల మీద కండువాను మార్చేశాడు. ఆయ‌న క‌మ‌లం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.

అప్ప‌టి నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌తో పాత శ‌త్రుత్వాల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టుగా ఉన్నాడు. అందులో భాగంగా ఘ‌నంగా జ‌రిగిన ఆయ‌న త‌న‌యుడి వివాహ నిశ్చితార్థానికి వైసీపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానించారు. పార్టీలా జ‌రిగిన ఆ కార్య‌క్ర‌మానికి ఎక్క‌డో విదేశాల‌కు వెళ్లొచ్చారు చాలా మంది వైసీపీ నేత‌లు కూడా. నిశ్చితార్థాన్నే అంత ఘ‌నంగా చేసిన సీఎం ర‌మేశ్ ఇప్పుడు కొడుకు పెళ్లిని మ‌రింత ఘ‌నంగా చేయ‌బోతున్నారు. అందుకు ఆహ్వానాలు పంచుతూ ఉన్నారు.

అందులో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసి ఆహ్వానించారు. ఏపీ శాస‌న‌స‌భ స‌మావేశాల వేళ‌, వాడీవేడీ రాజ‌కీయాల స‌మ‌యంలో సీఎం ర‌మేశ్ వెళ్లి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని త‌న త‌న‌యుడి వివాహానికి ఆహ్వానించారు. గ‌తంలో వైఎస్ ఫ్యామిలీ అంటేనే చిట‌ప‌ట‌లాడుతూ వ‌చ్చిన సీఎం ర‌మేశ్ ఇప్పుడు స్వ‌యంగా వెళ్లి జ‌గ‌న్ ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. ఈ విష‌యం ఇప్పుడు ఆస‌క్తిని రేపుతూ ఉంది. ఇంత‌కీ సీఎం ర‌మేశ్ త‌న త‌న‌యుడి పెళ్లికి త‌న మాజీ నాయ‌కుడు చంద్ర‌బాబును ఎప్పుడు ఆహ్వానిస్తున్నారో అనే అంశం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.