అరెరే.. ఇప్పుడే రాయలసీమ గుర్తుకు వచ్చిందా!

Wed Oct 16 2019 20:00:01 GMT+0530 (IST)

చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహిత నేతగా మెలిగారు. చంద్రబాబు నాయుడుకు బినామీ అంటూ ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు. ముఖ్యమంత్రి  హోదాలో ఉన్న వ్యక్తికి అతి సన్నిహితుడిగా మెలిగారు. అయితే అప్పుడు సీఎం రమేష్ అనే ఈయనకు రాయలసీమ గుర్తుకు రాలేదు. సీఎంగా రాయలసీమకు చెందిన వ్యక్తే ఉన్నా.. ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని అప్పుడంతా సీఎం రమేష్ కు అనిపించలేదు!ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా చంద్రబాబుకు ఈయన అతి సన్నిహితుడే అయినా అప్పుడంతా రాయలసీమకు అన్యాయం జరుగుతున్న విషయం ఈయనకు గుర్తుకు రాలేదు. అప్పుడంతా రాయలసీమను చంద్రబాబు నాయుడు రతనాల సీమ చేస్తున్నాడంటూ ప్రచారం చేశారు. ఆ రకంగా డప్పు కొట్టారు.

ఇప్పుడు పార్టీ కండువా మారింది - భారతీయ జనతా పార్టీ నేతగా ఈ ఫిరాయింపు ఎంపీ చలామణి అవుతున్నారు. ఇంతలో రాయలసీమ గుర్తుకు వచ్చింది. రాయలసీమకు అన్యాయం జరిగిపోతోందట. ముఖ్యమంత్రి  రాయలసీమ వ్యక్తే అయినా న్యాయం జరగడం లేదట.

ఈ పరిస్థితి మారటల. వింటే జనాలు నవ్వుతారు అనే ఫీలింగ్స్ ఏమీ లేకుండా బతికేస్తూ ఉంటారు రాజకీయ నేతలు. సీఎం రమేష్ కూడా అలాంటి కోవకే చెందేలా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నప్పుడు రాయలసీమకు జరుగుతున్న మోసం ఇలాంటి వారికి తెలియదని జనాలు అనుకోవాలి.

విభజిత ఏపీలో కర్నూలుకు ఏమీ దక్కకపోయినా - రాజధానిగా ఉండాల్సిన ప్రాంతానికి ఎలాంటి అవకాశం ఇవ్వకపోయినా.. వీరికి బాధ అనిపించలేదు. ఇప్పుడు తెలుగుదేశం చేతిలో అధికారం చేజారడం ఆ పార్టీ నుంచి బయటకు రావడంతో..సీమకు అన్యాయం అంటూ నిస్సిగ్గు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్లు! వీటిని చూసి జనాలు కూడా అసహ్యించుకుంటూ ఉన్నారు.