ఎంతటి వారైనా వదలొద్దు.. సీఎం కేసీఆర్ సంచలన ఆదేశాలు

Thu Jan 27 2022 07:00:01 GMT+0530 (IST)

CM KCR sensational orders

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ను లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.  ఈ మేరకు కఠినచర్యల దిశగా అడుగులు వేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం అనే మాటే వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈనెల 28న ప్రగతి భవన్ లో 'స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్' జరుపాలని సీఎం నిర్ణయించారు.కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు ఉన్నత అధికారులు హాజరు కానున్నారు.  రాష్ట్రంలో డ్రగ్స్ వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై బుధవారం ప్రగతి భవన్ లో కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని అన్నారు. కఠిన చర్యల అమలుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మందితో కూడిన ప్రత్యేకంగా 'కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ' పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్ ను వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది.

ఇక నుంచి తెలంగాణలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ మూలాలు బయటపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ చర్యలు డ్రగ్స్ తీసుకునే వారికి షాకింగ్ గా మారాయి.