Begin typing your search above and press return to search.

విమానం కొంటున్న సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   29 Sep 2022 2:30 PM GMT
విమానం కొంటున్న సీఎం కేసీఆర్
X
కొడితే పీఎం అయిపోవాలి.. మోడీని గద్దెదించేయాలి.. దేశ్ కీ నేతగా కేసీఆర్ ఆవిర్భవించాలి. జాతీయ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ అవే. అయితే ప్యాన్ ఇండియా లెవల్లో రాజకీయం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశయాలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాయి. జాతీయ రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని, కేటీఆర్ కూడా తన తండ్రికి పూర్తి మద్దతు ఇస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు విశ్వసిస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అడుగు ముందుకేస్తున్నాడు. జాతీయ రాజకీయాలను దున్నేయాలని బయలు దేరుతున్నాడు. ఈ దసరాకు జాతీయ కమిటీతోపాటు పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక 2014లో నరేంద్రమోడీ ఎలాగైతే దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాడో అలాగే కేసీఆర్ సైతం ప్రతీ రాష్ట్రంలో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం పకడ్బందీ ప్లాన్ చేస్తున్నాడు.

జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్న టీఆర్ఎస్ అదినేత కేసీఆర్.. కొత్త విమానం కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. 12 సీట్లున్న విమానానికి రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఇంత భారీ మొత్తం కోసం విరాళాలు ఇచ్చేందుకు గులాబీ నేతలు పోటీపడుతున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ వద్ద కూడా ప్రస్తుతం ఏకంగా రూ.865 కోట్ల నిధులున్నాయి. వీటిని జాతీయ స్థాయిలో సభలు, సమావేశాలు సహా పార్టీ సంబంధిత ఇతర ఖర్చుకు వెచ్చించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు.

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తీరుగా బీజేపీకి ప్రత్యామ్మాయంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక వనరులతోపాటు అవసరాల కోసం ప్రత్యేక విమానం అవసరం కావడంతో ఈ మేరకు దాన్ని కొనుగోలుకు రెడీ అవుతున్నారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రకటించిన తర్వాత కేసీఆర్ జాతీయ దృష్టిని ఆకర్షించారు. అతని రాజకీయ ఎత్తుగడలను కూడా బిజెపి నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర నాయ‌క‌త్వం వ‌ర‌కు అన్ని కోణాల్లో కేసీఆర్, ఆయ‌న కుటుంబంపై బీజేపీ విరుచుకుప‌డుతోంది. ఇటీవల ఈడీ దాడులు కూడా తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.