Begin typing your search above and press return to search.

సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్.. విషయం ఏమంటే?

By:  Tupaki Desk   |   26 May 2020 3:30 AM GMT
సర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్.. విషయం ఏమంటే?
X
ఊహించని రీతీలో వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. ఆయన తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు కొందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన.. అనూహ్యంగా వ్యవహరించే తీరు.. అందరిని ఆశ్చర్యపర్చటమే కాదు.. ప్రజల్లోనూ ఇమేజ్ పెంచేలా ఆయన తీరు ఉండటం గమనార్హం. తాజాగా ఒక సర్పంచ్ కు నేరుగా ఫోన్ చేశారు సీఎం కేసీఆర్.

ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ సర్పంచ్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముఖ్యమంత్రి లైన్ లోకి రావటంతోనే.. ఏం అశోక్ బాగున్నావా? అంటూ పలకరించిన వైనంతో ఫిదా అయ్యాడు. రాష్ట్రంలో వందలాది మంది సర్పంచులు ఉన్నప్పటికీ.. సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామ సర్పంచ్ కు కేసీఆర్ ఫోన్ ఎందుకు చేసినట్లు? అన్నది ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. ఆ గ్రామ పరిధిలోనే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఉంది.

దాన్ని త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తానే స్వయంగా రావాలని డిసైడ్ అయిన విషయాన్ని సర్పంచ్ కు నేరుగా చెప్పారు కేసీఆర్. కొండపోచమ్మ ప్రాజెక్టు వద్దకు వెళ్లావా? అంటూ ప్రశ్నిస్తూ.. త్వరలోనే దాన్ని ప్రారంభిద్దాం. నీళ్లతో నింపుకుందాం.. మర్కుక్ లో పండుగ చేసుకుందామన్న కేసీఆర్.. ఆ కార్యక్రమానికి తానే వస్తున్నట్లుగా చెప్పారు.

మరి తాను వస్తున్న వేళ.. వరాల వర్షం కురిపించటానికి సిద్ధంగా ఉండే కేసీఆర్.. సర్పంచ్ ను ఇంకేమైనా కావాలా? అని అడిగారు. గ్రామ పంచాయితీ భవనం లేదన్న మాటకు స్పందిస్తూ.. ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజునే గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి భూమిపూజ చేద్దామని.. రైతువేదిక నిర్మాణాన్ని సైతం షురూ చేద్దామన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్ల మీద ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పిన కేసీఆర్ మాటలకు సర్పంచ్ అశోక్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అతగాడికి పట్టిన అదృష్టానికి పలువురు సర్పంచ్ లు అసూయ పడే పరిస్థితి. కొన్నిసార్లు అంతే.. కాలంతో పాటు.. కేసీఆర్ మూడ్ తో ఇలాంటి సినిమాటిక్ ఉదంతాలు చోటు చేసుకుంటాయన్న మాట వినిపిస్తోంది.