Begin typing your search above and press return to search.

హెలికాఫ్టర్ జర్నీలో జగన్ సెల్ఫీ.. అంత భారీగా విమర్శలు ఎందుకు?

By:  Tupaki Desk   |   3 Dec 2021 3:30 PM GMT
హెలికాఫ్టర్ జర్నీలో జగన్ సెల్ఫీ.. అంత భారీగా విమర్శలు ఎందుకు?
X
ఇవాళ.. రేపటి రోజున కీలకస్థానాల్లో ఉండే వారు చేసే ప్రతి పని మీద కోట్లాది కళ్లు అనుక్షణం పహరా కాస్తుంటాయి. ఈ కారణంతోనే నోట్లో నుంచి వచ్చే మాటలు మొదలు.. కాలు కదిపే క్రమంలో చిన్నపాటి పొరపాటుకు భారీగా మూల్యం చెల్లించాల్సిన ఉంటుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టిన ఆయన.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో తీవ్రమైన తుపాను కారణంగా పెద్ద ఎ్తతున ఆస్తి నష్టంతో పాటు.. తొలినాళ్లలో ప్రాణ నష్టం కూడా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడూ వినని రీతిలో ప్రకాశం.. నెల్లూరు.. కడప.. అనంతపురం జిల్లాలు సైతం భారీ వర్షాల కారణంగా చోటు చేసుకునన వరదల కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నా.. ముఖ్యమంత్రి పరామర్శకు వెళ్లి రాలేదంటూ వేలెత్తి చూపించే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటివేళ తన సహచర మంత్రులు.. పార్టీ నేతలతో కలిసి హెలికాఫ్టర్ లో బయలుదేరారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఆయన ప్రయాణం మామలుగా సాగితే ఎలాంటి అభ్యంతరం లేదు.

అయితే.. హెలికాఫ్టర్ ప్రయాణంలో సీఎం జగన్ తన సహచరులతో కలిసి సెల్ఫీ దిగిన వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెళ్లింది వరద బాధితులను పరామర్శించటానికి అయినప్పుడు.. ఈ తీరులో సెల్ఫీలు దిగటమా? అని ప్రశ్నిస్తున్నారు. జలప్రళయంలో అఫ్తుల్ని కోల్పోయిన వారి కన్నీళ్లు తుడవటానికి.. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిలిచిన వారికి అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ప్రయాణంలో ఇలాంటివి చోటు చేసుకోవటం.. వాటికి సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ హడావుడి చేస్తున్నాయి.

ఒక తీవ్ర అంశానికి సంబంధించిన ప్రయాణం జరుగుున్నప్పుడు.. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాదు.. నవ్వుతూ సెల్ఫీలు దిగటం సరికాదు. ఎవరైనా సెల్ఫీలకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే.. వారిని సున్నితంగా అడ్డుకొని.. ఇది సందర్భం కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా నవ్వుతూ.. తుళ్లుతూ సెల్ఫీలకు ఫోజులిచ్చి మరీ ఫోటోలు దిగటాన్ని తప్పు పడుతున్నారు. గన్నవరం నుంచి కడప వరకు విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అక్కడ నుంచి మాత్రం హెలికాఫ్టర్ లో రాజంపేటకు వెళ్లారు.

ఇలాంటి వేళలో సీఎం జగన్ తో సెల్ఫీలు దిగటానికి చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తారు. వాటిని సున్నితంగా అడ్డుకోవాలి. అలాంటిది హెలికాఫ్టర్ లో ప్రయాణించే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట ఎంపీ మిధున్ రెడ్డి.. మంత్రి అదిమూలపు సురేశ్.. తన కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా సెల్ఫీ తీస్తుండటంతో అదో ప్రత్యేక సందర్భంగా మిగిలిన వారు భావించారు. ఈ ఫోటోను మంత్రి సురేశ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయటం.. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే అంశాన్ని ప్రస్తావించిన మాజీ మంత్రి నారా లోకేశ్ రియాక్టు అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది పరామర్శ కోసమా? సెల్ఫీలు దిగటానికా? అంటూ సూటిగా ప్రశ్నను సంధింరారు. 'ముఖ్యమంత్రిగారూ.. మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబ సభ్యుల్ని పరామర్శించటానికి. మీ వందిమాగదులతో సెల్ఫీలు తీసుకోవటానికి కాదు' అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. పరిహారంలో పరిహాసం అంటూ ఒక్క వ్యాక్యంతో తేల్చేసిన లోకేశ్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సీఎం జగన్ తీరును విమర్శించటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోని లోకేశ్ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. 'మీరు వెళ్లింది.. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చిన విపత్తు వల్ల జరిగిన వేల కోట్ల నష్టం పరిశీలించటానికి. ప్రజల్ని దూరం పెట్టి పళ్లు ఇకిలిస్తూ ఫోటోలు దిగటానికి కాదు. జనం బాధలు మీకు అంత పైశాచిక ఆనందం కలిగిస్తున్నాయా?' అంటూ సూటిగా ప్రశ్నించిన వైనం ఇప్పుడు కొత్త రచ్చగా మారింది. సమయం కాని సమయంలో తీసుకున్న సెల్ఫీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాకిచ్చిందని మాత్రం చెప్పక తప్పదు.