Begin typing your search above and press return to search.

తోడేళ్లు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌ గా వస్తుంది: సీఎం జగన్‌ హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   30 Jan 2023 2:49 PM GMT
తోడేళ్లు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌ గా వస్తుంది: సీఎం జగన్‌ హాట్‌ కామెంట్స్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ వచ్చే ఎన్నికల్లో తోడేళ్లన్నీ గుంపుగా వస్తాయని.. తాను సింహంలా సింగిల్‌ గా వస్తానని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారుకు మధ్య జరిగే యుద్ధమని అభివర్ణించారు. ముసలాయన చంద్రబాబు కావాలో.. యువకుడైన తాను కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా వినుకొండ లో సీఎం జగన్‌ పర్యటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. అక్కడి బహిరంగ సభలో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.

గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. సీఎంగా ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉన్నప్పుడు ఓ గజ దొంగల ముఠా ఉండేదన్నారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడు వీళ్లంతా గజ దొంగల ముఠాలా దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న బడ్జెట్‌ అప్పుడూ ఉందని.. మరి తాను అమలు చేస్తున్న పథకాలను అప్పుడు వారెందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్‌ ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారుగా అని జగన్‌ ప్రజలను ప్రశ్నించారు. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయన్నారు. సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు తెలిపారు. మీ బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవని.. మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడని వెల్లడించారు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదని చెప్పారు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడని వెల్లడించారు.

మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారని జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా? అని ప్రశ్నించారు. ప్రజలందరి అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నానన్నారు. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటేనన్నారు. మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి తనకు కావాలని జగన్‌ పేర్కొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.