Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీసులకు జస్టిస్ ఎన్వీ రమణ చెప్పిన మాట తెలిస్తే ఫిదా అవుతారంతే

By:  Tupaki Desk   |   17 Jun 2021 4:30 AM GMT
హైదరాబాద్ పోలీసులకు జస్టిస్ ఎన్వీ రమణ చెప్పిన మాట తెలిస్తే ఫిదా అవుతారంతే
X
ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. అలాంటి ప్రముఖుడు రోడ్డు మీద వెళ్లేటప్పుడు.. ఆయన వాహనంలో ట్రాఫిక్ లో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం మామూలే. ఆ మాటకు వస్తే ప్రముఖులంతా ఇలాంటి వసతిని వినియోగించుకుంటారు. కొందరు ప్రముఖులైతే.. ప్రోటోకాల్ ప్రకారం తమకు అవకాశం లేకున్నా.. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి.. తాము ప్రయాణించే రహదారిలో ట్రాఫిక్ నిలిపివేయాలని కోరటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.

సుప్రీంకోర్టుకు వేసవి సెలవుల నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో ఆయనకు ప్రత్యేక వసతిని కల్పించారు. ఈ నెల 19 వరకు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. జస్టిస్ రమణకు ఎస్ఆర్ నగర్ లో ఆయన సొంతిల్లు ఉంది. తెలంగాణ రాజ్ భవన్ నుంచి ఎస్ఆర్ నగర్ లోని తన ఇంటికి వెళ్లే క్రమంలో.. ఆయనకు ఇబ్బంది కలుగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ మొత్తాన్ని నిలిపేసి.. ఆయన వాహనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూశారు.

అయితే.. ట్రాఫిక్ నిలిపివేసిన సంగతిని గుర్తించిన సీజేఐ.. హైదరాబాద్ పోలీసులకు సూచన చేశారు. తన పర్యటనలో ఎప్పుడైనా సరే.. తన కోసం ట్రాఫిక్ నిలిపివేయకూడదని.. తన కోసం ఎంతో మంది వాహనాల్ని నిలిపివేయటం ఇష్టం లేదన్నారు. తన కారణంగా ప్రజలకు అసౌకర్యం కల్పించొద్దని కోరారు. ‘వారంతా వారి.. వారి పనుల మీద బయటకు వెళుతుంటారు. ఇలాంటి వేళ.. ట్రాఫిక్ నిలిపివేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అందుకే నగరంలో ప్రయాణించే సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాన్నికల్పించొద్దు’’ అని ఆయన కోరారు.

అత్యున్నత స్థానంలో ఉండి కూడా.. తనకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు వద్దని.. ఉన్న సదుపాయాన్ని కూడా తొలగించాలని కోరటం గొప్ప విషయంగా చెప్పాలి. సీజేఐ లాంటి వారే సామాన్యులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వద్దని చెబుతున్న వేళ.. ప్రముఖులంతా కూడా ఆయన బాటలో పయనించాల్సిన అవసరం ఉంది.