వైఎస్ వివేకా హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ

Wed Jun 09 2021 19:00:02 GMT+0530 (IST)

CBI probe into YS Viveka murder case

ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ సిట్ విచారణ జరగగా.. ఇప్పుడు సీబీఐ ఈ కేసును టేకప్ చేసి విచారిస్తోంది. వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు ఈ కేసును తేల్చాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ లతో విచారణకు కళ్లెం పడింది. ప్రస్తుతం మళ్లీ ఊపందుకుంది.వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇదయతుల్లాతోపాటు పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్ లను సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

నిన్న ఇదయతుల్లాను 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ మరోసారి అతడిని విచారణకు పిలిచారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచారణ జరుగుతోంది. నిన్న వైఎస్ వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని అధికారులు విచారించారు. అనంతరం అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇదయతుల్లాను ప్రశ్నిస్తున్నారు.

2019 మార్చిలో వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఇదయతుల్లా తన ఫోన్ లో ఫొటోలు తీసినట్టు అధికారుల వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలోనే అధికారులు కీలక విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.