నలుగురిపై చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ

Mon Sep 13 2021 19:01:40 GMT+0530 (IST)

CBI has filed chargesheets against the four

జడ్జీల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ నలుగురిపై ఏపీ హైకోర్టులో చార్జిషీట్లు దాఖలు చేసింది. వివిధ కేసులకు సంబంధించి కొందరు జడ్జీలిచ్చిన తీర్పులపై వైసీపీ నేతలు మద్దతుదారులు సానుభూతిపరులు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాల ప్రకారం ముందు కేసును సీఐడీ దర్యాప్తు చేసింది. అయితే విచారణలో ఉన్న పరిమితుల కారణంగా కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి కనబడలేదు. దాంతో హైకోర్టే దర్యాప్తు బాధ్యతల నుండి సీఐడీని తప్పించి సీబీఐకి అప్పగించింది.సీఐడీ ఎదుర్కొన్న ఇబ్బంది ఏమిటంటే మొదటిది అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారిలో అధికార పార్టీ నేతలుండటం. ఇక రెండో సమస్య ఏమిటంటే వ్యాఖ్యలు చేసిన వారిలో చాలామంది విదేశాల్లో ఉండటం. ఇందుకనే దర్యాప్తు బాద్యతను సీబీఐకి అప్పగించిందికోర్టు. మొదట్లో సీబీఐ కూడా సరైన దర్యాప్తుగా చేయలేకపోయింది. అయితే ఒకటికి రెండుసార్లు కోర్టు గట్టిగా చెప్పిన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే కాస్త పురోగతి సాధించింది.

కువైట్ లో ఉంటున్న లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి కడపకు రాగానే మొదటి అరెస్టు చేసింది సీబీఐ. తర్వాత మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంది. ఇలా మొత్తం మీద నలుగురిపై చార్జిషీటును సీబీఐ హైకోర్టులో దాఖలు చేసింది. జడ్జీలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వారు సుమారుగా 46 మందిని సీబీఐ గుర్తించింది. వీళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్న కారణంగా కనీసం విచారణకు నోటీసులు ఇవ్వడం కూడా సాధ్యం కావటంలేదు.

విదేశాల్లో ఉండి ఇక్కడ జడ్జీలపై వ్యాఖ్యలు చేసిన కారణంగా సీబీఐ కూడా ఏమీ చేయలేకపోతోంది. వ్యాఖ్యలు చేసిన వారెవరో గుర్తించినా వారెక్కడ ఉంటున్నారు ? వాళ్ళ అడ్రస్ ఏమిటనే విషయాన్ని తెలుసుకోవటం కష్టంగా ఉందని సీబీఐ హైకోర్టుకే చెప్పింది. ఒకవేళ వీళ్ళ అడ్రసులు తెలుసుకున్నా వాళ్ళని ఎలా రప్పించాలి ? లేదా వాళ్ళు ఇండియాకు వచ్చి వెళ్ళే విషయం ఎలా తెలుసుకోవాలి ? అనేది చాలా కష్టమైన వ్యవహారం.

విదేశాల్లో ఉన్న వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయాలంటే సీబీఐ అధికారులు వాళ్ళున్న దేశాలకు వెళ్ళాల్సుంటుంది. ఇదంతా ఇప్పటికిప్పుడు అయ్యేపని కాదు. ఎందుకంటే దేశంలోని కేసులను పరిష్కరించలేకే సీబీఐ నానా అవస్థలు పడుతోంది. ఇక విదేశాలకు ఎప్పుడు వెళ్ళాలి ? ఎప్పుడు వాళ్ళని అరెస్టు చేసి తీసుకురాలి ? సరే ఏదైనా మెల్లిగా ఈ కేసుల్లో సీబీఐ పురోగతి సాధిస్తోందనే చెప్పాలి.